అంతా తూచ్‌..!

28 Apr, 2019 11:49 IST|Sakshi

ప్రభుత్వ నిబంధనలు కార్పొరేట్‌ కళాశాలలకు పట్టడం లేదు. తమ దారి అడ్డదారి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఒక పక్క పదో తరగతి పరీక్ష ఫలితాలు రాకుండానే ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఐఐటీ, నీట్‌ ర్యాంకుల ఆశలు చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నా ఉత్తమ ఫలితాల పేరుతో కళాశాలను నిర్వహిస్తున్నారు. ఆటవిడుపు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. విద్యార్థులకు ఇష్టం లేకున్నా బలవంతపు చదువులు రుద్ది వారిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్నారని పలువురు మండి పడుతున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన ఇంటర్‌ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. తమ చేతులు తడిపితే ఎప్పుడైనా తరగతులు నిర్వహించుకోవచ్చంటూ సంకేతాలు పంపుతుండడం గమనార్హం.

నెల్లూరు(టౌన్‌): జిల్లావ్యాప్తంగా మొత్తం 189 ప్రభుత్వ, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 58 ప్రభుత్వ, 15 ఎయిడెడ్, 116 కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 58 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. అదే నెల 29వ తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్‌ 3వ తేదీన జూనియర్‌ కళాశాలలు ప్రారంభించాల్సిఉంది. అయితే కళాశాలల యాజమాన్యాలు ఉత్తీర్ణత శాతం, ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవులతోపాటు పండగ రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య, గాయిత్రి తదితర జూనియర్‌ కళాశాలలు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి.

వేసవి సెలవులు ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపకుండా కళాశాలల్లోనే ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారు. ముందుగానే టాలెంట్‌ టెస్ట్‌ రాయాలంటూ విద్యార్థులను కళాశాలలకు పిలిపించి వారిని తమ కళాశాలలో చేరే విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిరోజూ ఏదో ఒక కళాశాలకు వెళ్లి యాజమాన్యాలను నిలదీస్తున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులతో మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తరగతుల నిర్వహణపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగువేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
 
ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు  
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పబ్లిక్‌ పరీక్షలు రాసిన వెంటనే మళ్లీ తరగతులు అంటే విద్యార్థులు విముఖత కనబరుస్తున్నారు. కనీసం ఆటవిడుపు కూడా లేకుండా నిత్యం పుస్తకాలు పట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుస్తకాలతో విద్యార్థులను కుస్తీ పట్టిస్తున్నారు. ఒత్తిడికి తట్టుకోలేని విద్యార్థులు రకరకాల మానసిక ఆందోళనకు గురివుతున్నారు.
 
భారీగా ఫీజులు 
ఇంటర్‌లో ప్రవేశం కోసం కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఐఐటీ, నీట్‌ల పేరుతో రూ.లక్ష నుంచి రూ.3.50 లక్షల వరకు ఫీజులు నిర్ణయించారు. వీటితోపాటు దుస్తులు, పుస్తకాలు, పరీక్ష ఫీజు, ఆన్‌లైన్‌లో పరీక్ష, మెయింటినెన్స్‌ల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే తమ పిల్లలు సెటిల్‌ అవుతారన్న ఆశతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజులపై నియంత్రణ ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కార్పొరేట్‌ ఆగడాలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదు
వేసవి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదు. ప్రధానంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే తరగతులు నిర్వహించకూడదు. విద్యార్థుల ప్రవేశాల కోసం ఎలాంటి టాలెంట్‌ టెస్ట్‌లు పెట్టకూడదు. కళాశాలలు జూన్‌ 3వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్‌ వచ్చే వరకు అడ్మిషన్లు చేపట్టకూడదు. అధిక ఫీజులు వసూలు చేయకూడదు. కళాశాల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఈ నిబంధనలను అత్రికమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. – ఎస్‌.సత్యనారాయణ, ఆర్‌ఐఓ

మరిన్ని వార్తలు