వాణీవిలాస్‌..చూస్తే దిల్‌ఖుష్‌

4 May, 2018 09:38 IST|Sakshi
112 ఏళ్లయినా చెక్కుచెదరని డ్యాం నిర్మాణం

అనంతపురం , మడకశిర :  పిల్లలూ...వేసవి సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారా.. ఆ సెలవుల్లో పర్యాటక ప్రాంతానికి వెళ్దామని ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే మడకశిర నియోజకవర్గ సరిహద్దుకు ఆనుకుని ఉన్న వాణీవిలాస్‌ జలాశయం(మారికణివె డ్యాం)ను కూడా మీ ప్లాన్‌లో చేర్చుకోండి. ఎందుకంటే ఈ డ్యాంకు ఈ డ్యాంకు 112 ఏళ్ల చరిత్ర ఉంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్‌ తాలూకా వాణీవిలాస్‌పురంలో రెండు కొండల మధ్య  ఈ డ్యాంను నిర్మించారు. చునిలాల్‌తారాచంద్‌ దలాల్‌ ఈ డ్యాం నిర్మాణానికి డిజైన్‌ చేశారు. 1898లో ఈ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించి 1907లో పూర్తి చేశారు. ఈ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 135 అడుగులు. హిరియూరు, హొసదుర్గ తదితర తాలూకాలకు ఈ డ్యాం ద్వారా సాగునీరు వెళ్తుంది.

ఈ డ్యాం కింద ఏటా వేలాది ఎకరాల భూములు సాగులోకి వస్తున్నాయి. డ్యాం కింది భాగాన మారెమ్మ దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో రోజూ పూజలు జరుగుతాయి. భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం ఈ డ్యాం సమీపంలో అత్యద్భుతమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. డ్యాంకు వచ్చే సందర్శకులంతా ఈ ఉద్యానవనంలో సేదదీరుతుంటారు. వేసవిలోనూ నీటి ప్రవాహం.. మండు వేసవిలోనూ చల్లని వాతావరణం ఉండడంతో ఈ డ్యాంకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని సరిహద్దు ప్రాంతాల వారితో పాటు బెంగళూరు, బళ్లారి, మైసూరు, తుమకూరు తదితర ప్రాంతాల సందర్శకులు ఈ డ్యాంను తిలకించడానికి ఎక్కువగా వస్తుంటారు. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ఈ జలాశయం వద్ద ఎన్నో సినిమాలను చిత్రీకరించారు.

ఎలా వెళ్లాలంటే..
ఈ డ్యాం చిత్రదుర్గ జిల్లా హిరియూర్‌కు 20 కి.మీ దూరంలో ఉంది. మడకశిరకు 100 కి.మీ దూరంలో ఉంటుంది. మడకశిర నుంచి అమరాపురం మీదుగా హిరియూర్‌కు చేరుకుంటే అక్కడి నుండి బస్సు సౌకర్యం ఉంది. హిరియూర్‌ నుంచి హొసదుర్గకు రోడ్డు మార్గాన వెళ్లాలి. అనంతపురం నుంచి కల్యాణదుర్గం, చెళ్ళకెర, హిరియూర్‌ మీదుగా కూడా ఈ డ్యాంకు చేరుకోవచ్చు. బస చేయడానికి గెస్ట్‌హౌస్‌ సౌకర్యం కూడా ఉంది.

మరిన్ని వార్తలు