అవినాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

11 Mar, 2015 01:32 IST|Sakshi
అవినాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సుమోటోగా కేసు నమోదు చేసిన మానవ హక్కుల కమిషన్
 
కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర చుట్టూ  ఉచ్చు బిగుస్తోంది. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం  కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. గతంలో అవినాష్‌ను పట్టుకుని వదిలేసిన వ్యవహారంలో పెద్దాపురం సీఐ శ్రీధర్‌బాబు, ఎస్సై శివకృష్ణలకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మంగళవారం చార్జి మెమోలు ఇచ్చారు. విచారణ అనంతరం వీరి పాత్ర ఉన్నట్టు తేలితే సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అవినాష్ దురాగతాలపై ఏప్రిల్ 6 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

హైదరాబాద్‌లో అవినాష్?:ఇతడిని పట్టుకునేందుకు  ఎస్పీ రవిప్రకాష్ ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అవినాష్ నివాసానికి ఓ బృందం వెళ్లింది.  పెద్దాపురానికి చెందిన లూథరన్ హైస్కూల్ కరస్పాండెంట్ ఇజ్రాయిల్ ఫిర్యాదు మేరకు అవినాష్‌పై   కేసు నమోదు చేశారు. మరోపక్క బాధితులను చిత్రహింసలు గురి చేసిన వీడియో దృశ్యాల అధారంగా సుమోటోగా మరో కేసు నమోదైంది. కాకినాడకు చెందిన ఒక మహిళకు మానవ హక్కుల కమిషన్ రాష్ర్ట మహిళా విభాగం చైర్‌పర్సన్ పదవి ఇప్పిస్తానంటూ అవినాష్ రూ. 14 లక్షలు కాజేశాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది.  మరోవైపు మంగళవారం ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇటువంటి వ్యక్తికి గతంలో గన్‌మెన్‌ను ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

నాడు స్మగ్లర్...నేడు చీటర్:  అవినాష్ స్మగ్లింగ్‌కు కూడా పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  నాలుగేళ్ల కిందట భద్రాచలం సమీపాన కారులో పులి చర్మాలను తరలిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో అవినాష్‌పై కేసు కూడా నమోదైంది.

>
మరిన్ని వార్తలు