రుతు రాగం..ఆలస్య తాళం

16 May, 2019 04:52 IST|Sakshi

‘నైరుతి’ జూన్‌ 6న కేరళను తాకే అవకాశం

కొనసాగుతున్న ద్రోణి 

నేడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు 

పలుచోట్ల పిడుగులు పడే అవకాశం

రాష్ట్రంలో మరో నెల సూర్య ప్రతాపం

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రానున్నాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీకల్లా రుతు పవనాలు కేరళను తాకుతాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్‌ 6వ తేదీ వరకు కేరళను తాకే అవకాశాలు లేవని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం  వెల్లడించింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి రుతు పవనాలు ప్రభావం చూపుతాయి. ఏడాది మొత్తమ్మీద కురిసే వర్షాల్లో 70 శాతం వర్షపాతం వీటి ద్వారానే నమోదవుతుంది. పంటలపై ప్రభావం చూపే నైరుతి రుతు పవనాలపైనే దేశ ఆర్థిక పరిస్థితి ముడిపడి ఉంటుంది. అందువల్లే ఈ రుతుపవనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కాగా, మే నెల 10 తేదీ తర్వాత కేరళ, లక్షద్వీప్‌లలో ఉన్న 14 వాతావరణ కేంద్రాల్లోని 60 శాతం కేంద్రాల్లో రెండు రోజుల పాటు 2.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. మరోవైపు బంగాళాఖాతం, అరేబియా సముద్ర శాఖలు నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని నిర్దేశిస్తాయి.

ఈ రెండు శాఖల్లో బంగాళాఖాతం శాఖ చురుగ్గానే ఉంది. అరేబియా శాఖ మాత్రం ఒకింత స్తబ్దుగా ఉంది. ఇది చురుకుదనం సంతరించుకోవడానికి కాస్త సమయం పడుతున్నందున నైరుతి రుతు పవనాలు కేరళను తాకడంలో ఆలస్యానికి కారణమని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే రుతు పవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, వాటికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈ నెల 18–19 తేదీల్లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఒకింత ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించినా, దాని ప్రభావం దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతంపై ప్రభావం చూపబోదని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేష్‌ ‘సాక్షి’కి చెప్పారు.  
 
ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం 
నైరుతి రుతుపవనాలు కేరళను ఆలస్యంగా తాకనున్న ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా చూపనుంది. సాధారణంగా ఈ రుతుపవనాలు కేరళను తాకిన వారం, పది రోజులకు రాయలసీమలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత క్రమంగా రాష్ట్రంలోకి విస్తరించి వానలు కురిపిస్తాయి. కేరళలోకి వీటి ప్రవేశం జాప్యం కావడం వల్ల రాష్ట్రంలోకి వాటి ఆగమనం ఆలస్యమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశం జూన్‌ రెండో వారంలో కనిపించే అవకాశం ఉంది. ఈ లెక్కన మరో నెల రోజులపాటు రాష్ట్రంలో ఎండలు కొనసాగనున్నాయి. 
 
కొనసాగుతున్న ద్రోణి 
దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ఒకింత తగ్గింది. బుధవారం కొన్నిచోట్ల సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు మాత్రమే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   
 
నిజమవుతున్న ఐఎండీ అంచనాలు  
నైరుతి రుతు పవనాల ఆగమనంపై ఐఎండీ వేస్తున్న అంచనాలు 2004 నుంచి నిజమవుతూ వస్తున్నాయి. ఒక్క 2015లో మాత్రం ఐఎండీ అంచనా తప్పింది. ఆ సంవత్సరం మే 30న రుతు పవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేయగా వారం రోజులు ఆలస్యంగా జూన్‌ 5న తాకాయి.  

మరిన్ని వార్తలు