మూడు రోజుల్లో 8 మంది మృతి

9 May, 2019 13:50 IST|Sakshi

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనం

తూర్పుగోదావరి :గత వారం రోజుల్లో ఎండ తీవ్రత పెరగడంతో వడదెబ్బలకు గురై జిల్లాలో పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్లో 8 మంది వడదెబ్బకు మృతి చెందారు. ఆరో తేదీన నలుగురు మృతి చెందగా, ఏడో తేదీన ఒకరు, ఎనిమిదో తేదీన ముగ్గురు మృతి చెందారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పైగా నమోదవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోకపోవడంతో మండుటెండలో స్పృహతప్పిపోతున్నారు. పిఠాపురం రైల్వే స్టేషన్లో ఇద్దరు యాచకులు సోమవారం ప్లాట్‌ఫారంపైనే ఊపిరులొదిరారు. నెల్లిపాక, కడియం, తొండంగి మండలాల్లో బుధవారం ముగ్గురు మృతి చెందారు. ఇలా రోజుకు ఒకరిద్దరు వడదెబ్బకు బలవుతుండడంతో జిల్లా వాసులు హడలిపోతున్నారు.

జిల్లాలో పెరుగుతున్న వడదెబ్బ మృతులు
మండుటెండలు మనుషుల ప్రాణుల తీస్తున్నాయి. వడదెబ్బతో జనం మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఈ మూడు రోజుల వ్యవధిలో సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

తాపీమేస్త్రి మృతి
తూర్పుగోదావరి, నెల్లిపాక (రంపచోడవరం): ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ఓ ఓ తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన బుధవారం ఎటపాక మండలంలోని సీతా పురం గ్రామంలో జరిగింది. కోడిదాసు భాస్కర్‌ (39) రోజూలాగే నెల్లిపాక గ్రామంలో గృహనిర్మాణ పనులకు సోమవారం కూడా వెళ్లాడు. అయితే ఎండలో పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతడిని భద్రాచంలోని ఓవైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అయినా భాస్కర్‌ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పరిస్థితి విషమించి బుదవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాజీ సర్పంచ్‌ సుకోనాయక్, వైఎస్సార్‌ సీపీ, జనసేన నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.  

దుళ్లలో వృద్ధుడి మృతి
కడియం (రాజమహేంద్రవరం రూరల్‌): వడగాడ్పులకు మండలంలోని దుళ్లలో కామిరెడ్డి అప్పారావు (72) అనే వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుధవారం ఎప్పటిలాగే తన పనుల్లో నిమగ్నమైన అప్పారావు మధ్యాహ్నం సమయానికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక వైద్యులను పిలవగా అప్పటికే అతడు మృతి చెందినట్టు తెలిపారు. వడగాడ్పుల కారణంగానే అస్వస్థతకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు.

వడదెబ్బకు వృద్ధుడి మృతి
తొండంగి (తుని): మండలంలోని పైడికొండలో బుధవారం వదదెబ్బకు గురై వృద్ధుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కె.వీర్రాజు(68) గ్రామంలో ఉపాధిహామీ మట్టిపనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు అందరూ అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మృతి చెందడంతో రెవెన్యూ అధికారులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు