దళిత దీపం.. సుందర్రాజు

22 Jul, 2018 12:21 IST|Sakshi

దళిత చైతన్య బావుటా

మాదిగ సాహిత్యానికి సుందరరూపం

‘చండాల చాటింపు’ పుస్తక పరిచయం

నేడు సుందర్రాజు 18వ వర్ధంతి

అనంతపురం కల్చరల్‌ : కవి,వక్త, విద్యావేత, అక్షరయోధుడిగా చిరపరిచితులైన డాక్టర్‌ నాగప్పగారి సుందరరాజుది తెలుగు సాహితీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం. కర్నూలు జిల్లా వాసి అయినా ఆయనకు ‘అనంత’తో ప్రత్యేక అనుబంధం ఉంది. దళిత సాహిత్యానికి తన జీవితాన్ని అంకితం చేసి, మాదిగల అంతరంగాలను మధించి కథలుగా .. ఉద్యమాలతో దళితుల సమస్యలను ముందుకు తీసుకెళ్లినా.. అది సుందరరాజుకే చెల్లిందనడంలో సందేహం లేదు. దళిత సాహిత్యంలో తనను తాను దగ్ధం చేసుకుని ఆ బూడిద నుంచే మండే సూర్యుడిగా ఆవిష్కరించాలన్న ఆయన తపనతోనే ‘మాదిగ సాహిత్య వేదిక’ ఏర్పాటైంది. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనకబడిన బహుజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన రాసిన ‘మా ఊరి మైసమ్మ’ నవల దర్పణం çపడుతోంది. 

అనంతతో సుందరరాజుకు అనుబంధం..
కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నేమకల్లులో పెద్ద నరసమ్మ, రంగన్న దంపతులకు 1968 మే 30న జన్మించిన  సుందర్రాజు.. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. జేఆర్‌ఎఫ్‌కూ ఎంపికయ్యారు. ఎస్కేయూలో 1999లో తెలుగు సహాయ ఆచార్యుడిగా చేశారు. విద్యార్థి దశ నుంచి ఆచార్యుడి వరకు ఎదిగిన క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఆత్మ గౌరవ పోరాటాలు అనేకం ఉన్నాయి.  సెంట్రల్‌ వర్శిటీలో చదివే సమయంలో  బ్రాహ్మణవాదంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ‘చండాల చాటింపు’ ఆయనను ద్రోహిగా అభివర్ణించినా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. 

ప్రతి కథా ఆలోచింపజేసేదే 
నాగప్ప గారి సుందరరాజు కలం నుంచి జాలువారిన ప్రతి కథా ఆలోచింపజేసింది. పోరాడమని సమాజాన్ని ముందుకు నడిపించింది. వెట్టి చేయలేక పెద్దోళ్ల అహంకారానికి వెట్టిచాకిరీకి బలై నిస్సహాయ స్థితిలో వ్యధకు లోనై ఉరేసుకొని ప్రాణాలొడ్డిన ‘జోరెసావు’ కథ అందరినీ ఆలోచింపజేసింది. ‘మాదిగోడు’ కథలో అగ్రవర్ణాల పెత్తనాన్ని కాకుండా దళిత సంస్కృతి, సంప్రదాయాలను వాళ్లలో ఉండే కళాత్మకతను ఆయన చక్కగా వివరించారు. మాండలీకాలకు మహారథం పట్టి మేము నిజం, మా జీవితాలు నిజం. మా జీవన విధానమిది. మా భాష, నుడికారమిది. చేతనైతే అర్ధం చేసుకోండి అని ధైర్యంగా తన యాసను, భాషను దైనందిన జీవితాన్ని వ్యవహారశైలిని, ఆహారపు అలవాట్లను తనదైన శైలిలో చాటిన కథగా ‘చండాలపు చాటింపు’ మిగిలిపోయింది.

పూచే పువ్వు గంధం నేను /వీచే  గాలి కదలికను నేను / నడిచే చరిత్ర రచయితను నేను..అంటూ విశ్వాసాన్ని ప్రకటించిన ఆయనే మరోచోట ‘డప్పు కొట్టిన చేత్తోనే డొక్క చీలుస్తాం / చెప్పులు కుట్టినచేత్తోనే చరిత్ర తిరగరాస్తాం..’ అంటూ దళిత జాతిని అవమానపరచిన వారిని ఘాటుగా హెచ్చరించారు.  

ప్రజ్వరిల్లుతున్న దళిత దీపం..
దళిత సాహిత్య పుటల్లోంచి మాదిగ సాహిత్య నిప్పుకణికలను రగిలించి, రంగరించిన మాదిగ వైతాళికుడు, మాదిగల మణిదీపం అయిన నాగప్పగారి సుందరరాజు చిన్నవయసులోనే అర్ధంతరంగా సాహితీలోకాన్ని వీడి దళిత సాహిత్యాన్ని అంధకారంలో ముంచెత్తి వెళ్లిపోయినా... ఆయన ప్రజ్వలింపజేసిన చైతన్యజ్యోతి అనంత వాసుల గుండెల్లో కణకణమంటూ మండుతూనే ఉంది. ఆయన అకాల మరణం జాతిని చైతన్యం చేసే ప్రతివారికీ తీరని లోటే. మండే సూర్యుడికి వెలుగులు జిమ్మే కాంతి పుంజానికి అంధకారం లేనట్టు ఆయన రచనలతో చైతన్యవంతమైన ఎందరో దళిత రచయితలు ఆయన జీవితాన్ని సమాజానికి దర్పణంలా చూపిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే  దళిత రచయితల వేదిక ఆధ్వర్యంలో  సుందర్రాజు 18వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్నారు. 

ఆయన దళితజ్యోతి 
నాగప్పగారి సుందర్రాజుకు మాతో ఎంతో పరిచయం ఉండేది. ఆయన మాటల్లో రాయలసీమ కసి, కరుకుదనం, మాదిగోడి నిర్భయత్వం, నిక్కచ్చితత్వం కనిపించేవి. మాదిగ శబ్ధాన్ని తిరుమంత్రంలా మ్రోగించి అటు వైదిక సాహిత్యానికి ఇటు మాదిగ సాహిత్యానికి ప్రత్యాయమ్నాయంగా నిలబెట్టిన ఆయన సాహిత్యాన్ని మేము క్రమం తప్పకుండా ప్రచారం సాగిస్తున్నాం. 
 – డాక్టర్‌ జెన్నె ఆనంద్, దళిత రచయితల వేదిక

అత్యంత ఆప్తుడు
మా ఊరి పక్కనే నాగప్పగారి సుందర్రాజు అమ్మవాళ్లు ఉండేవారు. వాళ్ల మేనమామ కవ్వప్పగారి ఈరన్న అని మా శిష్యుడు. అలా మా సాహిత్యసభకు వచ్చే సమయంలో ప్రేరణ పొంది తాను కవిత్వం రాసేవారు. అయితే సమాజంలో అతడు పొందిన అనుభవాల వల్ల మాదిగ సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. చైతన్యవంతం చేయగల వ్యక్తిత్వం ఉండడంతో అభ్యుదయ కవిగానే స్ధిరపడ్డారు. అర్థంతరంగా మన నుంచి వెళ్లిపోవడం బాధాకరం.    
– ఏలూరు యంగన్న, ప్రముఖ కవి, అనంతపురం

యువతకు స్ఫూర్తి   
నేను డిగ్రీ చదివే రోజుల్లో సుందరరాజు అన్న యూనివర్శిటీలో ఆచార్యుడిగా పనిచేసేవారు. ఆయన సాహిత్యాన్ని మేము నరనరానా వంటపట్టించుకున్నాం కాబట్టే ఆయన లేకున్నా ఆయన వదిలి వెళ్లిన ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం. అన్న రాసిన సునీత..సునీత అనే పాటు ఆ రోజుల్లో మార్మోగింది. మాదిగ సాహిత్యమంటే నాగప్పగారి సుందర్రాజుదే అన్నంతగా ఇమిడిపోవడం ఎంతో ఆనందం కలిగిస్తుంది.          
– డాక్టర్‌ ఎ.ఎ.నాగేంద్ర, ఎస్కేయూనివర్శిటీ

మరిన్ని వార్తలు