సన్‌డే

25 May, 2015 00:50 IST|Sakshi

పెరుగుతున్న వడదెబ్బ మృతులు
61 మంది మృతి

 
 నెల్లూరు (అర్బన్) : సూరీడు నిప్పులు అలాగే కురిపిస్తున్నాడు. గ్రీష్మ తాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. దీంతో జిల్లాలో ఎండ తీవ్రత అలాగే ఉంది. జూన్ పదో తేదీ కత్తెర వరకు సూర్యతాపం ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గ్యాప్ లేకుండా పనిచేస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు వేసవి తాపాన్ని భరించలేకపోతున్నారు. ఆదివారం 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి వడగాడ్పులు వీచాయి. నాలుగు రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది. గురువారం 43.8 డిగ్రీలు, శుక్రవారం 42.4 డిగ్రీలు, శనివారం 42.1 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం వరకు వడదెబ్బ కారణంగా 85 మంది చనిపోగా ఆదివారం.

 జిల్లా వ్యాప్తంగా 61 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కాగా ఏఎన్‌ఎంలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వడదెబ్బబారిన పడకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలని ఆదేశించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భారతీరెడ్డి చెప్పారు.

 వడదెబ్బ మృతులు ముగ్గురేనా?
 వడదెబ్బకు ఒక వైపు జనం పిట్టల్లా రాలుతోంటే అధికారులు ముగ్గురు మాత్రమే చనిపోయినట్లు నిర్ధారిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు వడదెబ్బకు 126 మంది చనిపోయారని అనుమానిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు మాత్రమే వడదెబ్బకు చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. వడదెబ్బకు చనిపోయారా? లేదా? అని నిర్ధారించే విషయంలో అధికారులు నెమ్మదిగానే ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎస్‌ఐ, తహశీల్దార్, మెడికల్ ఆఫీసర్ నిర్ధారించాల్సి ఉంది. ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఎక్కువై పలువురు మృత్యువాత పడుతోంటే అధికారులు నిర్ధారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు