పార్టీలకు అనుబంధ సంఘంగా పనిచేయొద్దు

12 Feb, 2019 05:16 IST|Sakshi
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకువస్తున్న సునీల్‌ అరోరా తదితరులు

కలెక్టర్లు, ఐపీఎస్‌లతో భేటీలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా తీవ్ర వ్యాఖ్యలు

తప్పుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

అసాధారణ ఓట్ల చేర్పులు, తొలగింపుల్ని సమీక్షించాలని సూచన

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పక్షానికో, ప్రతిపక్షానికో అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఎన్నికల నిర్వహణలో తటస్థంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని కలెక్టర్లు, ఐపీఎస్‌లతో సోమవారం ఆయన సమీక్షించారు. విజయవాడ నోవాటెల్‌ హోటల్‌లో దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ అంతరంగిక సమావేశంలో ఈసీ దృష్టికి వచ్చిన వివిధ అంశాల్ని సీఈసీ సూటిగా ప్రస్తావించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కొందరు అధికారులు రాజకీయ విభాగం(పొలిటికల్‌ ఎక్స్‌టెన్షన్‌ వింగ్‌)గా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయంటూ తన దృష్టికి వచ్చిన అంశాల్ని ప్రస్తావించారు. అలాంటి లోపాలు ఉంటే సరిచేసుకోవాలని, తెలిసి తప్పుచేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ గట్టిగా చెప్పడంతో సమావేశం అనంతరం పలువురు అధికారులు ఈ అంశంపై చాలా సేపు చర్చించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

సమావేశంలో ఎన్నికల కమిషన్‌ ప్రస్తావించిన అంశాల్లో కొన్ని..
‘కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓట్ల చేర్పులు, తొలగింపులు జరిగాయి. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 నుంచి 18 వేల కొత్త ఓట్లు చేర్చారు. కొన్ని నియోజకవర్గాల్లో 8 వేల వరకు ఓట్లు తొలగించారు. వీటిపై కూడా ఫిర్యాదులు అందాయి. అమాంతం ఓట్లు పెరిగితే పరిశీలించుకోవాలి. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చేర్పులు, తొలగింపులపై సమీక్షించేలా కలెక్టర్లు బాధ్యత వహించాలి. లేదంటే జాతీయ ఎన్నికల కమిషన్‌ నుంచే ప్రత్యేక టీంలను పంపి సమీక్షించాల్సి ఉంటుంది. ఏకంగా 18 శాతంపైగా ఓట్ల చేర్పులు జరిగితే వాటిపై లెక్క చూపించాల్సిన అవసరం ఉంది. ఓటర్ల లిస్టులపై రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలి.

నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు, కొత్త ఓట్లు, తొలగించిన ఓట్ల పూర్తి వివరాలతో ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వాలి. జిల్లాల్లో ఓటర్ల కోసం 1950 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఓటర్ల అనుమానాల నివృత్తికి, సాయం కోసం కాల్‌సెంటర్‌ను ఉపయోగించుకునేలా ప్రచారం చేయాలి. ఈ కాల్‌ సెంటర్‌  24 గంటలు పనిచేయాలి. గత ఎన్నికల్లో నమోదైన కేసులు ఇంకా పెండింగ్‌లో పెడితే ఉపేక్షించేది లేదు. నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉంటే అలాంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేయాలి. లైసెన్స్‌డ్‌ వెపన్స్‌(ఆయుధాలు)ను స్వాధీనం(డిపాజిట్‌) చేసుకోవాలి’ అని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా సూచించినట్లు సమాచారం.

వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించండి
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఎన్నికల్లో వీవీప్యాట్‌లను వినియోగిస్తున్నామని, వాటిపై ఓటర్లలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సీఈసీ సూచించారు. ఫిర్యాదులపై స్పందించకపోతే ఎన్నికల కమిషన్‌ ఉపేక్షించదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  

>
మరిన్ని వార్తలు