పిటి వారంట్లపై కోర్టుకు సునీల్

1 Jan, 2015 05:22 IST|Sakshi

అనంతపురం లీగల్ : అక్రమ వసూలు, కిడ్నాప్, మారణాయుధాలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట సునీల్‌కుమార్ (పులివెందుల)ను నార్పల పోలీసులు  కోర్టులో బుధవారం హాజరుపరిచారు. 2014 జూలై 18న నార్పలకు చెందిన వ్యాపారిని కారులో కిడ్నాప్ చేసినట్లు, అక్రమంగా బలవంత వసూళ్లకు పాల్పడినట్లు వ్యాపారి భార్య చేసిన ఫిర్యాదులో సునీల్‌తో పాటు మరో 13 మందిపై ఉన్న కేసు అనంతపురం మేజిస్ట్రేట్ కోర్టులో వాయిదాకు వచ్చింది

సునీల్‌ను రాజమండ్రి జైలు నుంచి పిటివారంట్లపై పోలీసులు తీసుకొచ్చి హాజరుపరిచారు. మొత్తం నిందితులు హాజరు కావటంతో కేసును విచారణ నిమిత్తం సెషన్స్ కోర్టుకు కమిటల్ చేయడానికి జనవరి 3వ తేదీకి వాయిదా వేస్తు మేజిస్ట్రేట్ బి.బుజ్జప్ప ఆదేశాలు జారీ చేశారు. కాగా 2014 ఫిబ్రవరి 11న అవే మారణాయుధాలు కలిగి ఉన్నాడన్న నేరంలో మరో నలుగురితో సహా నిందితుడిగా ఉన్న సునీల్ విచారణ ఎదుర్కొంటున్నాడు.

విచారణ కొనసాగుతున్న ఈ కేసులో నిందితులకు జనవరి 5న హాజరుకావాలని మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. సంచలనం రేకెత్తించిన సునీల్‌ను భారీ బందోబస్తు నడుమ కోర్టుకు హాజరు పరచడంతో వారు తిరిగి వెళ్లే వరకు కోర్టు ఆవరణలో సందడి కనిపించింది.
 

మరిన్ని వార్తలు