సుంకేసుల సీమాంధ్రదే..!

22 Nov, 2013 03:37 IST|Sakshi
సుంకేసుల సీమాంధ్రదే..!

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో తుంగభద్ర నదిపై నిర్మించిన అతిపురాతనమైన సుంకేసుల బ్యారేజ్ ఏ ప్రాంతానికి చెందుతుందనే వాదన తెరపైకి వచ్చింది. అయితే, బ్యారేజ్ మొత్తం కర్నూలు జిల్లాలోని సుంకేసుల గ్రామ పంచాయితీ పరిధిలోనే ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని సీమాంధ్రకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ‘సుంకేసుల’ సరిహద్దుకు సంబంధించిన పూర్తి వివరాలతో వారు రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందాన్ని(జీఓఎం) కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. జీఓఎంకు సమర్పించేందుకు వారు ఒక సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో రిటైర్డు డీఈ వెంకట్రావు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధి ప్రసన్న ఉన్నారు. అయితే, వారికి రెండు మూడు రోజుల్లో తమను కలిసే అవకాశం ఇస్తామని జీవోఎం చెప్పినట్టు తెలిసింది.
 
 అధికారుల వాదన ప్రకారం.. కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజక వర్గంలోని కర్నూలు మండలం.. మహబూబ్‌నగర్ జిల్లా, వడ్డెపల్లి మండలం మధ్యలో నిర్మించిన సుంకేసుల బ్యారేజ్ రెవెన్యూ రికార్డుల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు, కడప జిల్లాల ఆయకట్టు రైతులకు సాగు, త్రాగునీటి అవసరాల కోసం ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. సుంకేసుల గ్రామ రెవెన్యూ సరిహద్దు.. బ్యారేజ్‌కి అవతలవైపున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలి గ్రామంలో ఉండేది. బ్యారేజీ అవతలివైపు ఉన్న భూములను సుంకేసుల గ్రామ రైతులే సాగుచేసేవారు.
 
  1980 వరకు రాజోలిలోని కుమ్మరిగేరిలో సుంకేసుల పొలిమెర సరిహద్దు రాయి ఉండేదని స్థానికులు చెపుతున్నారు. అయితే బ్యారేజి నిర్మాణానంతరం అవతలివైపు సుంకేసుల వాసులు సాగుచేసుకుంటున్న భూములు ముంపునకు గురయ్యాయి. ఇందుకు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా తీసుకున్నట్లు ఆధారాలున్నాయని వారు వెల్లడించారు. సీమాంధ్ర రిటైర్డ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తమ వాదనలకు ఆధారంగా బ్రిటిష్ కాలంనాటి రెవెన్యూ మ్యాప్‌లను చూపుతున్నారు. బ్రిటీష్ కాలంలో రామళ్లకోట తాలూకా ఉన్న సమయంలోని సుంకేసుల రెవెన్యూ సరిహద్దు మ్యాప్ ఆధారంగా తుంగభద్రనదిలో సుమారు 390 ఎకరాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
 
 తెలంగాణదే అనడానికి ఆధారాలు లేవు
 తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయినా సుంకేసులపై తమకు హక్కుందని వాదిస్తున్నారని ఆ రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు. రాజోలిలోని కుమ్మరిగేరిలో సుంకేసుల పొలిమేర సరిహద్దు రాయి ప్రస్తుతం కనిపించకపోవడాన్ని తెలంగాణ వారు ప్రస్తావిస్తున్నారని, అయితే, వరదల్లో ఆ రాయి కొట్టుకుపోయి ఉంటుందని వారు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 1న సుంకేసుల జలాశయాన్ని పరిశీలించేందుకు వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ బ్యారేజి సరిహద్దులపై కర్నూలు జిల్లాకు చెందిన అధికారులతో వాదించారు. అయితే ప్రాజెక్టు రిపోర్ట్, సుంకేసుల రెవెన్యూ గ్రామ సరిహద్దు రికార్డుల ప్రకారం బ్యారేజ్‌పై మహబూబ్‌నగర్ వారికి ఎటువంటి హక్కులేదని కర్నూలు జిల్లా అధికారులు వారికి వివరించారు.
 
 సుంకేసుల బ్యారేజ్ నేపథ్యం
 1861లో డచ్ కంపెనీ వారు వ్యాపార సౌలభ్యం కోసం తుంగభద్ర నదిపై ఆనకట్ట కట్టారు. ఆ తరువాత ఎన్టీ రామారావు 1985లో బ్యారేజీగా మార్చి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అనంతరం 1998లో రూ.8కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో నిర్మాణం పూర్తయింది.
 

మరిన్ని వార్తలు