వడదెబ్బ మరణం.. పరిహారం అందుకోండిలా..!

9 May, 2019 13:12 IST|Sakshi

పోస్టుమార్టం, వైద్యాధికారి నివేదికే కీలకం

కడప అగ్రికల్చర్‌ : వేసవి తీవ్రత పెరిగింది. భానుడు భగ భగ మండుతున్నాడు. మే నెలలో వడగాల్పులు మరీ అధికంగా ఉంటున్నాయి. ఎండలతో పాటు ఊపిరాడని ఉక్కపోత మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఎండ, ఉక్కపోతను తట్టుకోవడం ప్రజలకు కష్టమైంది. అందులోనూ శ్రామికులు, రైతులు, రైతు కూలీలు, ఉపాధి కూలీలు జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వడదెబ్బ వల్ల అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఆ కుటుంబం కోలుకోలేని విధంగా నష్టపోతుంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం పొందాలంటే దీనిపై అవగాహన పెంచుకోవడం అవసరం. వడదెబ్బకు గురవుతున్న వారిలో అధికంగా పేదవారే ఉంటున్నారు. వీరిలో చాలా మందికి నష్టపరిహారం ఎలా పొందాలో అవగాహన ఉండడంలేదు.

త్రిసభ్య కమిటీ సిఫార్సుతప్పని సరి...
వడదెబ్బకు గురై మృతి చెందితే ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేస్తుంది. వడదెబ్బకు సంబంధించి ప్రతి మండలానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ వడదెబ్బకు గు రై చనిపోయిన వారి వివరాల నివేదికను త యారు చేసి కలెక్టర్‌ పరిశీలనకు పంపుతుం ది. ఆ నివేదికను కలెక్టర్‌ పరిశీలించిన తరువాత పరిహారం మంజూరు చేస్తారు. ఎండ తీవ్రతపై ఉపాధి పథకం వేతన కూలీలు, శ్రామికులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్లు ఎండలోనే తిరగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంది. వడదెబ్బకు గురై చనిపోతే ప్రభుత్వం నుంచి మృతుడి కుటుంబీకులు రూ.50 వేల పరిహారం పొందే అవకాశం ఉంది.

కమిటీ ఏం చేస్తుందంటే...
వడదెబ్బ మృతుల నిర్ధారణకు మండలంలో త్రిసభ్య కమిటీ ఉంటుంది. దీనిలో వైద్యాధికారి, తహసీల్దార్, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) సభ్యులుగా ఉంటారు. –వడదెబ్బ కారణంగా మరణం సంభవిస్తే కమిటీ సభ్యులకు తప్పకుండా సమాచారం అందించాలి.
ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందుగా వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి సమీపంలోని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలిస్తారు. అక్కడ పోస్టుమార్టం చేస్తారు. ఆ నివేదికను వైద్యాధికారి పోలీసు స్టేషన్‌కు అందజేస్తే ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు.
ఆ నివేదికను మండల తహసీల్దార్‌ ద్వారా ఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్‌ పరిశీలనకు పంపిస్తారు. నివేదికను కలెక్టర్‌ ప రిశీలించిన తరువాత పరిహారాన్ని బాధిత కుటుంబానికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.

మరిన్ని వార్తలు