కిరణ స్పర్శ కాసింతే..

10 Mar, 2019 16:02 IST|Sakshi
దిశ మారిన సూర్యకిరణాలు

అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం పాక్షికంగా కిరణ దర్శనమైంది. ఉత్తరాయణ, దక్షిణాయన కాలమార్పుల్లో భాగంగా గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తొలిసూర్యకిరణాలు స్పృశించే అరుదైన దృశ్యం కోసం ఎదురుచూసిన భక్తులకు కొంతమేరకు నిరాశే మిగిలింది. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు మంచు కమ్మేయడంతో సూర్యోదయం కాస్తా ఆలస్యమైంది. దీంతో శనివారం ఉదయం 6.28 నిమిషాలకు సూర్యోదయ తొలికిరణాలు ఆలయ ధ్వజస్తంభాన్ని తాకి అంతరాలయంలోకి చేరుకున్నాయి. అయితే కిరణాల దిశ మారిపోవడంతో కిరణాలు పూర్తి స్థాయిలో మూలవిరాట్టును తాకలేదు.

దీంతో పాక్షికంగా తాకిన కిరణాల దర్శనాలతో భక్తులు వెనుదిరిగారు. పలువురు ఉన్నతాధికారుల కుటుంబసభ్యులు ఆదిత్యుని కిరణ దర్శనాన్ని తిలకించేందుకు వచ్చి, స్వామిని  దర్శించుకున్నారు. పెద్ద సం ఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ఈవో ఆర్‌.పుష్పనాథం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభం నుంచి అంతరాలయం వరకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి  శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశా రు. కలెక్టర్‌ సతీమణి పబితా నివాస్, ఎస్పీ సతీమణి రామలక్ష్మి, డీఎస్పీ ఎ.చక్రవర్తి తదితరులు కిరణ స్పర్శను చూసేందుకు వచ్చారు.

నేడు కూడా కిరణ దర్శనానికి అవకాశం

తొలి సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం కూడా కన్పించేందుకు అవకాశముంద ని ఆలయ ఈవో తెలియజేసారు. ఈమేరకు భక్తు ల దర్శనాలకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కిరణాల దర్శనం తర్వాత సాధారణ దర్శనాలకు అవకాశమిస్తామని తెలియజేసారు.

ఆనందంగా ఉంది..

తొలిసారి ఆదిత్యుని కిరణాలను తాకే దృశ్యం చూసేందుకు వచ్చాను. కొద్దిపాటి సమయం అంతరాలయంలో స్వామి వారి విగ్రహంపై కిరణాలు పడటం కన్పించింది. చాలా ఆనందంగా ఉంది. మళ్లీ ఆదివారం కూడా అవకాశముందని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోసారి చూసేందుకు ప్రయత్నిస్తా.
                                                     –పబితా నివాస్, జిల్లా కలెక్టర్‌ సతీమణి  

మరిన్ని వార్తలు