ప్రచండ సూర్యుడి..మరణమృదంగం

17 Jun, 2014 01:51 IST|Sakshi
ప్రచండ సూర్యుడి..మరణమృదంగం

సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రచండ నిప్పులు చెరుగుతోన్న ఎండలు...ఆ ఎండలు తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతోన్న జనం..ఆందోళన కలిగిస్తోన్న వడదెబ్బతో జనం గుమ్మం దాటి బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చారా వడగాడ్పులను తట్టుకోలేక మృత్యువాతకు గురవుతున్నారు. జిల్లాలో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు పాతిక నుంచి 30 మంది వడదెబ్బతో మృత్యువాతకు గురవుతున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. లేదంటే  వడదెబ్బకు తీసుకోవాల్సిన చర్యలంటూ మొక్కుబడిగా పత్రికా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో ఒక్క జూన్ నెలలోనే జిల్లావ్యాప్తంగా సోమవారంనాటికి వడదెబ్బకు మృత్యువాతపడ్డ వారి సంఖ్య 181కి చేరింది. మృతుల సంఖ్య జిల్లాలో ఆందోళన కలిగి స్తోంది. జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ నెట్‌వర్క్ నుంచి అందుతోన్న సమాచారాన్ని క్రోడీకరిస్తే మృతుల సంఖ్య పై విధంగా లెక్క తేలింది. సోమవారం ఒక్కరోజే రాత్రి తొమ్మిది గంటల వరకు  అందిన సమాచారాన్ని బట్టి చూస్తే జిల్లాలో 64 మంది వడదెబ్బతో మృతిచెందినట్టు లెక్క తేలింది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
 
 జిల్లా యంత్రాంగం మాత్రం వడదెబ్బ మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించేందుకు ఎందుకనో వెనుకంజ వేస్తోంది. కానీ అంతర్గతంగా అధికారిక వర్గాలు వేస్తున్న లెక్కలను బట్టి ఇంతవరకు జిల్లావ్యాప్తంగా వడదెబ్బ మృతుల సంఖ్య 26గా తేల్చారు. వీరిలో ఒక్క సోమవారమే 16 మంది మృత్యువాత పడ్డట్టుగా చెబుతున్నారు. అధికారులు చెబుతోన్న లెక్కలకు వాస్తవ విరుద్దంగా ఉంటున్నాయి. ఇందుకు వారి కారణాలు వారికి ఉండవచ్చు, లేదా ప్రభుత్వం వడదెబ్బ మృతులకు రూ. లక్షన్నర (ఎక్స్‌గ్రేషియా, ఆపద్బంధు కలిపి) ప్రకటించడంతో ఆర్థికభారం తగ్గించుకొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకునైనా ఉండవచ్చునంటున్నారు. వాస్తవంగా వడదెబ్బ మృతుల సంఖ్యకు యంత్రాంగం  చెప్పే లెక్కలకు అసలు పొంతనే లేని పరిస్థితి కన్పిస్తోంది.
 
 రోహిణీ కార్తెను మించిపోయిన మృగశిర కార్తె
 రోకళ్లు కూడా పగిలిపోతాయనే రోహిణీ కార్తెను సైతం మృగశిరకార్తె మించి పోయింది. రోహిణీకార్తె ఈ నెల 7వ తేదీతో ముగిసింది. అనంతరం మృ గశిరకార్తె ప్రారంభమైంది. ఇక రుతుపవనాలు వచ్చేస్తాయి, వాతావరణం చల్లబడుతుందని జనమంతా గంపెడాశతో ఎదురుచూశారు. అందుకు విరుద్దంగా జిల్లాలో వేడిగాలులు ఇంకా హడలెత్తిస్తూనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకే జిల్లాలో ఏ మూల ఏ రోడ్డు చూసినా జనం లేక నిర్మానుష్యంగా మారిపోతోంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే వడదెబ్బ మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. వడదెబ్బతో మృతిచెందిన వారిలో 50 సంవత్సరాలు పైబడ్డ వారు అధికంగా ఉంటున్నప్పటికీ పాతిక సంవత్సరాలు లోపు ఉన్న యువకులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతమంది మృత్యుఒడికి చేరుతున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఏ రోజుకారోజు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నా వాటిని తగ్గించి చూపేందుకు చూపుతున్న శ్రద్ధ వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడంపై చూపలేకపోతున్నారు.
 
 జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల ద్వారా ప్రజలకు వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన వైద్య ఆరోగ్యశాఖ సైతం మొక్కుబడి ప్రకటనలకే పరిమితమవ్వడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతమంది చనిపోతున్నా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆ శాఖకు లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ దిశగా వైద్య ఆరోగ్యశాఖను నడిపించాల్సిన జిల్లా అధికారులు ఏమి చేస్తున్నారంటున్నారు.
 
 పాఠశాలలకు సెలవులివ్వడానికేం..
 వడదెబ్బతో వృద్ధుల నుంచి పాతికేళ్ల యువకుల వరకు మృతిచెందుతున్న తరుణంలో పాఠశాలలను ఈ నెల 20 వరకు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈ నెల 12న పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం తెరిచినప్పటికీ వడగాడ్పుల తీవ్రతతో తొలుత రెండు రోజులు సెలవుగా జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ప్రకటించారు. కొనసాగింపుగా సోమవారం కూడా సెలవు ఇచ్చారు. కానీ ఎండల తీవ్రత ఎక్కడా తగ్గకున్నా సెలవులు మరో రెండు రోజులు పొడిగించకపోవడాన్ని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నడి వయస్సు వారే వడదెబ్బకు తట్టుకోలేక మృతిచెందుతున్న క్రమంలో చిన్నారులు ఏరకంగా పాఠశాలలకు వెళ్లగలుగుతారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో దాదాపు రెండు నెలలు మూతపడ్డప్పుడు లేని సమస్య ఇప్పుడు రెండు, మూడు రోజులు సెలవులు ఇస్తే ఏమొస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వడదెబ్బను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల్లో  అవగాహన కల్పించాల్సిన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాలి.
 
 వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు
 డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి
 కాకినాడ క్రైం : జిల్లాలో గత ఐదు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ప్రజలు ప్రధానంగా వయోవృద్ధులు, శిశువులు వడదెబ్బ బారిన పడుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సి.పద్మావతి సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చన్నారు.
 
 జాగ్రత్తలివీ...
     చల్లగా ఉండే ప్రదేశాలలో ఉండాలి
     నెత్తికి టోపీ, పలుచటి తెల్లని దుస్తులు మాత్రమే ధరించాలి
     దాహం ఉన్నా లేకున్నా ఉప్పు కలిపిన నీరు ఎక్కువగా తాగాలి
     వడదెబ్బకు గురైన వారి శరీరాన్ని తడి  వస్త్రంతో రుద్దాలి
     వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి
 
 వారికి ఇబ్బందే
 భానుగుడి (కాకినాడ) : జిల్లాలో పదోతరగతి పరీక్షా కేంద్రాలు గల పాఠశాలల్లో విద్యార్థులు నేటి నుంచి తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో పదోతరగతి పరీక్షా కేంద్రాలు గల 30 పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి రెండోపూట పాఠశాలలు నిర్వర్తించేలా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం పూటవచ్చే వారంతా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. వీరికి ఉదయం పూట బడులు నిర్వహించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాలలకు సుదూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు రావాల్సి ఉందని వారంతా ఎండబారిన పడి పాఠశాలకు వచ్చి పాఠాలు చెప్పడం కష్టం అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఉదయం పూట బడులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు