పంటలకూ వడదెబ్బ!

23 May, 2018 03:48 IST|Sakshi

ఎండ నుంచి తోటలను కాపాడుకునేందుకు రైతుల పాట్లు

పంటకు చీరల పందిరి
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మురహరినాయుడు అనే రైతు తనకున్న 3 ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. అయితే ఎండల తీవ్రతకు పంట ఎండిపోతుంటే దానిని కాపాడుకునేందుకు పాత చీరలను సేకరించి వాటితో పందిళ్లు వేశారు. ఇందుకోసం మురహరి రూ.35 వేలు ఖర్చు చేశారు. 
– కనగానపల్లి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మండిపోతున్న ఎండలకు ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పంటలు కమిలిపోకుండా పందిర్లు వేస్తున్నారు. ఉష్ణతాపానికి  మొక్కలు ఎండిపోకుండా చెట్టు చుట్టూ ఈత మట్టలు, తాటిమట్టలు, వరిగడ్డి, జొన్న దంట్లు లాంటివి కప్పుతున్నారు.   

రెండు రోజులకే వాడుముఖం
పెరిగిన ఎండలతో వడదెబ్బ ప్రభావం పైర్లకు కూడా తప్పడంలేదు. టమాటా, మిరప, బెండ, గోరుచిక్కుడు తోటలు నీటి తడిపెట్టిన రెండు రోజులకే వాడిపోతున్నాయి. భూమి వేడెక్కుతున్నందున నీటి తడులు పెట్టిన రెండు రోజులకే పైర్లు వాడుముఖం పడుతున్నాయి. తర్భూజ, దోస, కర్భూజ కాయలు తోటల్లోనే కమిలిపోతున్నాయి. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఎండ నుంచి రక్షణ కోసం అరటి గెలలకు పాత గోనె సంచులు, ఎండిన అరటి ఆకులను చుట్టూ కప్పుతున్నారు. అలాగే సూర్యప్రతాపం నుంచి ప్రయాణికులకు రక్షణ కోసం ఆర్టీసీ బస్సుల్లో కిటికీలకు గడ్డి, వట్టి వేళ్లతో పరదాలు అమర్చారు. అలాగే ‘గతంతో పోల్చితే విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని వాతావరణంలో మార్పు వచ్చింది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన 33 వేల ఎకరాలను రాజధాని కోసం తీసుకుని చెట్లను నరికి బీడుగా మార్చిన ప్రభావం పడినట్లుంది’ అని విజయవాడకు వరప్రసాద్‌నాయుడు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు