కాకతో వేగుతుంటే ఊకదంపుడు ఉపన్యాసాలు

25 May, 2015 00:47 IST|Sakshi

మినీ మహానాడులో
 టీడీపీ నేతల మైకు పూనకం
 మంత్రి, పార్టీ అధ్యక్షుడు
 వలదన్నా సుదీర్ఘ ప్రసంగాలు
 ఆరుబయట సెగలు కక్కే
 వాతావరణంలో కార్యకర్తల అగచాట్లు

 
 అన్నవరం: అసలే ఎండలు మండిపడుతున్న వేసవికాలం. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెపుతున్నారు. ఇవేమీ తెలుగుదేశం నాయకులకు పట్టినట్టు లేదు. జనం వేగిపోతున్న ప్రాణాంతక వాతావరణంలోనే ఆరుబయట షామియానాలు వేసి మినీమహానాడు నిర్వహించారు. ఇక మైకు ముందుకొచ్చిన ప్రతి నాయకుడూ పావుగంటకు తక్కువ కాకుండా ప్రసంగిస్తుంటే మల మల మాడిపోవడం  కార్యకర్తల వంతయింది.
 
   అన్నవరం శివారు వల్లభ ఎస్టేట్‌లో టీడీపీ మినీ మహానాడు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. వేదిక మీద కూలర్లు, ఏసీ మిషన్లు అమర్చడంతో అక్కడి నాయకులకు వేడి తగల్లేదు. కానీ వేదిక దిగువనున్న వారికి మాత్రం ఎండ వేడితో నరకం కనిపించింది. పార్టీ నేతలు రెడ్డి సుబ్రహ్మణ్యం, బత్తుల రాము, ఎమ్మెల్యేలు వర్మ, అయితాబత్తుల ఆనందరావు, తోట త్రిమూర్తులు, బుచ్చయ్య చౌదరి తదితరులు ఒకరితో ఒకరు పోటీ పడి ప్రసంగించారు. కొందరైతే మైకు దొరకడమే పండుగ అన్నట్టు వ్యవహరించారు. వర్మ ప్రసంగించేటపుడు మంత్రి దేవినేని వారించినా మరో రెండు నిమిషాలు మాత్రమే అంటూనే అందరి సహనాన్ని పరీక్షించారు.
 
  వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కొద్దిసేపే మాట్లాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు సూచించినా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి తోడు అందరి ప్రసంగాలూ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడడానికి, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని, ఆ పార్టీ అధినేత జగన్‌ను విమర్శించడానికి పరిమితం కావడంతో విసుగు పుట్టించారుు. ఆ ఆరుగురూ ప్రసంగించేటప్పటికే సమయం మధ్యాహ్నం రెండు అయింది. కాగా, సమావేశం ప్రారంభమైన అరగంటకే ఎండవేడి భరించలేక  సగానికి పైగా జనం వెళ్లిపోయారు. మిగిలిన వారు కూడా దగ్గరలోని చెట్ల కింద చేరి సేద తీరారు. సమావేశం ముగిసేటప్పటికి రెండు, మూడు వందల మంది మాత్రమే మిగిలారు.
 
 పోలీసులను వెళ్లిపొమ్మన్న హోంమంత్రి
 మంత్రుల కార్యక్రమమంటేనే పోలీసుల హడావిడి ఎక్కువ. దానికి తోడు హోం మంత్రి పోగ్రాం అంటే చెప్పనక్కర్లేదు. వేదిక మీదున్న హోమంత్రి నిమ్మకాయల చినరాజప్పను కలవడానికి వెళుతున్న పెద్దాపురం నియోజకవర్గ నాయకుడిని తుని సీఐ అప్పారావు ఆపారు. దాంతో ఆ నాయకుడు సీఐతో వాగ్వాదానికి దిగాడు. అతనికి మద్దతుగా మరికొందరు రావడంతో హోంమంత్రి కలగజేసుకుని ‘ఇది పార్టీ కార్యక్రమం. పార్టీ వాళ్లే చూసుకుంటారు.  పోలీసులు సమావేశ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలి’ అని ఆదేశించడంతో చిన్నబుచ్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
 
 మాకు పరిహార మిప్పించాలి..
  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన తమ భూములు పోతున్నాయని, మంచి పరిహారం ఇప్పించాలని ఖమ్మం జిల్లా నుంచి జిల్లాలో విలీనం అయిన నాలుగు మండలాల నాయకులు కోరారు. కొత్తగా ఏర్పాటైన ఎటపాక రెదవెన్యూ డివిజన్‌కు చెందిన మువ్వా శ్రీను నాయకత్వంలో రైతులు, నాయకులు ఈ మేరకు మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ తదితరులను అభ్యర్థించారు.
 

మరిన్ని వార్తలు