ఏసీబీకి చిక్కిన సోమశిల భూసేకరణ సూపరింటెండెంట్

5 May, 2015 04:14 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్): ప్రూప్ ఆఫ్ అవార్డు కోసం (నిర్వాసిత  ధ్రువీకరణ పత్రం) రూ. 2వేలు లంచం తీసుకొంటూ సోమవారం సాయంత్రం నగరంలోని సోమశిల భూసేకరణ విభాగం  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోని  సూపరింటెండెంట్  ఏసీబీ అధికారులకు దొరికారు. ఏసీబీ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎం మూర్తి కథనం మేరకు.. సోమశిల ప్రాజెక్టు కట్ట నిర్మాణ సమయంలో బొంతల శేషయ్యకు చెందిన ఇంటి స్థలాన్ని భూసేకరణ విభాగం శాఖ సేకరించింది. దానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు 1982ను అవార్డు కాపీని ఇచ్చారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో బేల్దారీ పనులు చేసుకుంటున్న  శేషయ్య మనుమడు కఠారి అరుణ్‌కుమార్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయసాగాడు.  తన తాతకు చెందిన ఇంటి స్థలంను సోమశిల ప్రాజెక్టు కట్ట నిర్మాణ సమయంలో  భూసేకరణ విభాగం సేకరించిందనీ, దానికి సంబంధించి ప్రూప్ ఆఫ్ అవార్డు కాపీ కోసం నెల్లూరులోని సోమశిల భూసేకరణ విభాగం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్(డిప్యూటీ తహశీల్దార్)టి. రమేష్‌కుమార్‌ను ఆరునెలల కిందట ఆశ్రయించారని తెలిపారు. శేషయ్య వారసులము తామేనని ఫ్యామిలీమెంబర్స్ సర్టిఫికేట్‌ను సైతం సూపరింటెండెంట్‌కు అందజేరన్నారు. తనతో పాటు దరఖాస్తు చేసుకొన్న వారంద రూ ప్రూప్ ఆఫ్ అవార్డు కాపీని తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు.  

ఎంతకూ అవార్డు కాపీని ఇవ్వకపోవడంతో పలుమార్లు సూపరింటెండెంట్‌ను కలిశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్‌ను సైతం కలిసి తన పరిస్థితిని విన్నవించాడు. ఆయన అవార్డు కాపీని ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయిన్నప్పటికి రమేష్‌కుమార్ బాధితుడిని తిప్పించుకోసాగాడు. ఇటీవల రమేష్‌కుమార్ బాధితునికి ఫోనుచేసి రూ. 3,500ఇస్తే అవార్డు కాపీని ఇస్తానని చెప్పాడు. రూ. రెండువేలు అయినా ఇస్తే పనిచేస్తానని చెప్పడంతో బాధితుడు లంచం ఇవ్వలేక ఏసీబి అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆర్‌విఎస్‌ఎం మూర్తి సూచనల మేరకు సోమవారం బాధితుడు సూపరింటెండెంట్‌ను కార్యాలయంలోనే  కలిశాడు.

ముందస్తు ఒప్పందం ప్రకారం రూ. రెండువేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా రమేష్‌కుమార్‌ను పట్టుకున్నారు. రసాయన పరీక్షలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నెల్లూరు అరవిందనగర్‌లోని రమేష్‌కుమార్ ఇంట్లో ఏసీబి అధికారులు సోదాలు నిర్వహించారు. రమేష్‌కుమార్‌ను ఏసీబి అధికారులు నాల్గోనగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఆయనను ఏసీబి ప్రత్యేక కోర్టులో హాజరుపెట్టనున్నారు. ఏసీబి అధికారులు అరెస్ట్‌చేసిన రమేష్‌కుమార్ 2014అక్టోబర్ 28నుంచి భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు.

కడుపు మంటతోనే ఏసీబీకి పట్టించా...
కడుపు మంటతోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని బాధితుడు అరుణ్‌కుమార్ మీడియా ఎదుట వాపోయాడు. తన ఆర్థిక పరిస్థితి సూపరింటెండెంట్‌కు తెలిపినా పట్టించుకోలేదనీ, రూ. రెండువేలు ఇచ్చేంతవరకూ పీడించాడని ఆవేదన వ్యక్తం చేశారు.  దాడుల్లో ఏసీబి సిఐలు ఎన్. శివకుమార్‌రెడ్డి, కృపానందం, సిబ్బంది శ్రీను, కె. మధు, ఖుద్దూస్, సుధాకర్, ఫణి, రవీంద్ర, ఎం మధు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు