వైద్యం ఇక ‘సూపర్‌’

5 Jul, 2020 10:07 IST|Sakshi
పెద్దాసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ విభాగం( ఇన్‌సెట్‌)లో మెడికల్‌ కాలేజీ పరిపాలన భవనం

సూపర్‌ స్పెషాలిటీకి మంచి రోజులు  

తాజాగా నెఫ్రాలజీ విభాగానికి పీజీ సీట్లు  

ఇప్పటికే మూడు విభాగాలకు మంజూరు

త్వరలో మరికొన్ని విభాగాల్లో ఎంసీహెచ్‌ కోర్సు  

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాతికేళ్ల క్రితం సూపర్‌స్పెషాలిటీ కోర్సులు మంజూరైనా భవనం లేక ఎన్నో అవస్థలు. ఆ సమస్య 2002లో తీరింది. ‘సూపర్‌’  విభాగాలున్నా ఎండీ, ఎంసీహెచ్‌ కోర్సులు లేని లోటు ఇన్నాళ్లకు తీరింది. ఇటీవల మూడు విభాగాలు పీజీ సీట్లు సాధించగా, తాజాగా నెఫ్రాలజీ విభాగం సైతం ఆ జాబితాలో చేరింది. త్వరలో మరో మూడు సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఎంసీహెచ్‌ కోర్సుకు అనుమతులు రానున్నాయి. దీంతో సామాన్య రోగులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వైపు చూడకుండా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ‘సూపర్‌’ వైద్యం అందనుంది.         

కర్నూలు మెడికల్‌ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (బోధనాసుపత్రి)కి 65 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఇప్పటికీ సూపర్‌స్పెషాలిటీ కోర్సులు ఇక్కడ ప్రారంభం కాలేదు. ఆరు జిల్లాలకు పెద్ద దిక్కుగా మారి, రోజూ వేలాది మందికి చికిత్సను అందించే ఈ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గత పాలకులు విముఖత చూపారు. చెప్పుకోవడానికి అవసరమైన సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. అలాగే సమయం, శ్రమ తెలియకుండా పనిచేసే వైద్యులు ఉన్నారు. కానీ అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బందిని మంజూరు చేయడంలో గత పాలకులు తగిన శ్రద్ధ చూపలేదు. ఫలితంగా రాయలసీమ జిల్లాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా, తిరిగి ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వైపు చూడాల్సిన పరిస్థితి.

సామాన్యునికి జబ్బు వస్తే ప్రైవేటుకు వెళ్లి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ ఎస్‌. సంజీవకుమార్‌ పలుమార్లు చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు గాను ఆయన తన వంతు కృషి  చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు బోధనాసుపత్రిలో సూపర్‌స్పెషాలిటీ విభాగాలకు పీజీ సీట్లు తెప్పించడంలో తన వంత పాత్ర పోషించారు. ఎంసీఐని సంప్రదించి, అందుకు సంబంధించిన ఫైలును ముందుకు కదలించే ప్రక్రియ చేపట్టారు. ఈ కారణంగా ఇటీవల యురాలజీ (ఎంసీహెచ్‌), నేడు నెఫ్రాలజీ (ఎండీ) విభాగాలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. రెండేళ్ల క్రితం కార్డియాలజీ (ఎండీ), గ్యాస్ట్రో ఎంట్రాలజి (ఎండీ) విభాగాల్లోనూ పీజీ కోర్సు మొదలైంది. ఆయా విభాగాల్లో ఏడాదికి రెండు సీట్ల చొప్పున మూడేళ్లకు ప్రస్తుతం ఆరుగురు పీజీ వైద్య విద్యార్థులు చదువుతూనే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు.     

ఉపయోగాలు ఇవీ..
ఆసుపత్రిలోని కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, యురాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్‌ సర్జరి, ప్లాస్టిక్‌ సర్జరి, క్యాన్సర్‌ విభాగాలను సూపర్‌స్పెషాలిటీ విభాగాలుగా పిలుస్తారు. ఆయా విభాగాలు దాదాపు 35 ఏళ్ల క్రితమే ఏర్పడినా ఇప్పటి వరకు వాటికి పీజీ సీట్లు మంజూరు కాలేదు. దీంతో పేదలు మెరుగైన వైద్యానికి దూరమయ్యే పరిస్థితి. నెఫ్రాలజీ, న్యూరోసర్జరి, కార్డియాలజీ, పీడియాట్రిక్‌ సర్జరి, ప్లాస్టిక్‌ సర్జరి విభాగాల్లో పడకల సంఖ్యకు మించి రెండు, మూడింతలు రోగులు చేరి చికిత్స పొందుతున్నారు.

అనధికారికంగా ప్రతి విభాగంలో 40 నుంచి 100 పడకలు అధికంగా ఉంటున్నాయి. అయినా ఆయా విభాగాలకు పీజీ సీట్లు తెప్పించడంలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఆయా విభాగాల్లో పీజీ సీట్లు రావడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో ఆయా విభాగాల్లో జూనియర్‌ వైద్యుల సంఖ్య ఆరుకు పెరుగుతుంది, దీంతో పాటు రోగులకు వచ్చే వ్యాధులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వీలుంది. దీంతో పాటు వైద్య విద్యార్థులు అభ్యసించేందుకు, వారు జాతీయ, రా్రïÙ్టయ సదస్సుల్లో పరిశోధనాపత్రాలు సమరి్పంచేందుకు సైతం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పలు పరిశోధనలకు సైతం ఈ ఆసుపత్రి వేదికగా అయ్యే అవకాశం ఉంది.  

అన్ని రంగాల్లో అభివృద్ధి 
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తోందని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ ఎస్‌. సంజీవకుమార్‌ అన్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ(బోధనాసుపత్రి)లోని నెఫ్రాలజీ విభాగానికి పీజీ సీట్లు మంజూరైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనిషి తనకు వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకునేందుకు  ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పటికీ సూపర్‌స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్తున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి రానీయకుండా ప్రభుత్వం కర్నూలు ఆసుపత్రిలో రూ.720 కోట్లతో నూతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చేస్తోందన్నారు. అలాగే వందలాది మంది వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమిస్తోందని చెప్పారు. దాతలు సైతం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌(సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని కోరారు.

కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి. నరేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 4 సూపర్‌స్పెషాలిటీ విభాగాలకు పీజీ సీట్లు వచ్చాయని, త్వరలో న్యూరోసర్జరి, పీడియాట్రిక్‌ సర్జరి, ప్లాస్టిక్‌ సర్జరి విభాగాలకు సైతం ఎంసీహెచ్‌ కోర్సు రానుందన్నారు. దీనివల్ల ఆయా విభాగాలు బలోపేతం అవుతాయని, రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్, డాక్టర్‌ నరసింహులు, యురాలజిస్టు డాక్టర్‌ విక్రమసింహారెడ్డి, డాక్టర్‌ సీతారామయ్య, నెఫ్రాలజిస్టు డాక్టర్‌ పీఎన్‌ జిక్కి, డాక్టర్‌ శ్రీధర్‌  పాల్గొన్నారు.      

మరిన్ని వార్తలు