వరద తగ్గింది.. ‘ఇసుక’ పెరిగింది

9 Nov, 2019 04:30 IST|Sakshi

ఐదు రోజుల్లో 4 లక్షల టన్నుల వెలికితీత 

నీరు పూర్తిగా తగ్గితే కోరినంత సరఫరా చేసేందుకు ఏపీ ఎండీసీ సన్నద్ధం

సాక్షి, అమరావతి: ఇసుక రీచ్‌ల వద్ద వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ఇసుక సరఫరాను క్రమేణా పెంచుతోంది. రీచ్‌లలో నీరు పూర్తిగా ఇంకిపోతే ప్రజలు కోరినంత ఇసుకను స్టాక్‌ యార్డుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 1వ తేదీన 31,576 మెట్రిక్‌ టన్నుల ఇసుక మాత్రమే రీచ్‌ల నుంచి స్టాక్‌ యార్డులకు చేరింది. శుక్రవారం ఇది 96,600 టన్నులకు పెరిగింది.

గడచిన ఐదు రోజుల్లో మూడు రెట్లు అధికంగా ఇసుక లభించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సుమారు 4 లక్షల టన్నుల ఇసుకను ఏపీ ఎండీసీ స్టాక్‌ యార్డులకు చేరవేసింది. తూర్పు గోదావరి జిల్లాల్లో తవ్విన ఇసుకను కలిపితే 4.30 లక్షల టన్నుల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో తవ్వకాలను రెట్టింపు చేయడం ద్వారా కోరినంత ఇసుకను ప్రజలకు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. 

రోజుకు 2 లక్షల టన్నుల సరఫరా 
ఇదే పరిస్థితి కొనసాగి మరిన్ని రీచ్‌లలో వరద నీరు ఇంకిపోతే రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ యార్డులకు చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఏపీ ఎండీసీ వైస్‌ చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూధన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వర్షాలు ఆగిపోతే వారం రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అధిగమించి ప్రజలకు కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాల్లోని వంకలు, వాగులు, ఏర్లలో ఇసుక తవ్వకాలకు అనువైన 300 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.  

మరిన్ని వార్తలు