ఇక సన్న బియ్యం సరఫరా

22 Jun, 2019 05:01 IST|Sakshi

1.47 కోట్ల కుటుంబాలకు లబ్ధి 

ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగులు 

సెప్టెంబర్‌ నుంచి పంపిణీపై మంత్రులు, అధికారుల సమీక్ష 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులున్న 1.47 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్‌ ఒకటి నుంచి  ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సన్నబియ్యాన్ని గ్రామ వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే పంపిణీ చేసే ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథరాజు, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తదితరులు శుక్రవారం సచివాలయంలో సమావేశమై సన్న బియ్యం సేకరణ, పంపిణీపై చర్చించారు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బియ్యం నాసిరకమైనవి కావడంతో వండుకుని తినడానికి పనికి రాలేదనే ఆరోపణలున్నాయి. దీంతో  చాలా మంది పేదలు సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్‌లో తక్కువ ధరకే విక్రయించేవారు. ఇవే బియ్యం రీసైక్లింగ్‌ ద్వారా ఎఫ్‌సీఐకి వెళ్లి తిరిగి రేషన్‌ షాపులకు వచ్చే విధానం ఇన్నాళ్లూ కొనసాగింది.  

ప్రజలు ఏ రకం బియ్యం తింటున్నారో అవే పంపిణీ.. 
ప్రజలు ఏరకం బియ్యం తింటున్నారో అవే రకం బియ్యాన్ని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేయడంతో బియ్యం సేకరణపై సమావేశంలో చర్చించారు. స్వర్ణ, 1121 రకానికి చెందిన బియ్యం ప్రస్తుతం ఏమేరకు అందుబాటులో ఉన్నాయో వివరాలు సేకరించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా టీంలను పంపారు. రాష్ట్రంలో 1000, 1010, 1001 రకం బియ్యం రైతులు పండిస్తున్నా రాష్ట్రం ఆ రకానికి చెందిన బియ్యం తినడం లేదని సమావేశంలో చర్చకు వచ్చింది.

ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సరఫరా విషయమై చర్చించేందుకు ఈ నెల 26వతేదీన సరఫరాదారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కల్తీలేని, తినేందుకు అనువైన సన్నబియ్యాన్ని సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయని గుర్తించామని, సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.1000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేశామని మంత్రి కొడాలి వివరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా