ఎందుకంత చిన్నచూపు

7 Oct, 2015 00:03 IST|Sakshi

కౌలు రైతులకు అందని చేయూత
 ఎల్‌ఈసీ కార్డుల లక్ష్యం 40వేలు
జారీచేసిన కార్డులు 20,260
రుణాలు పొందిన రైతులు 1498 మంది
మంజూరు చేసిన రుణం రూ.2.91కోట్లు

 
అన్నదాతలకు ఆదరణ కరువైంది. రుణసాయం అందక  ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు. ఖరీఫ్‌లో ఇప్పటి వరకు రూ.740కోట్ల రుణాలందజేశామని యంత్రాంగం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ జిల్లాలో కౌలు రైతులకు దక్కింది మాత్రం ఈ రుణమొత్తంలో అరశాతం కూడా లేదు.
 
విశాఖపట్నం:  జిల్లాలో 2,79,481 హెక్టార్ల సాగుభూమి ఉంది. దీనిపై ఆధారపడి 4,29,773 మంది సన్న చిన్నకారు రైతులున్నారు. మరో 44,965 మంది పెద్ద రైతులున్నారు. వీరిలో మూడొంతు లు అంటే మూడులక్షల మందికి పైగా కౌలురైతులే. ఏటికాయేడు పెట్టుబడులు పెరుగుతుండడంతో సాగు భారం మోయలేక కౌలురైతులు కాడినొదిలేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంత కష్టపడుతున్నా వీరికి గిట్టుబాటయ్యేది నామమాత్రం. రుణాల నుంచి పరిహారం వరకు ప్రతీ విషయంలోనూ వీరికి అన్యాయం జరుగుతూనే ఉంది. కౌలురైతులకు భరోసా కల్పించేందుకు జారీ చేస్తున్న రుణ అర్హత కార్డులు (ఎల్‌ఏసీ) ఏమాత్రం అక్కరకు రావడం లేదు. ఎలాంటి హామీ లేకుండా ఈ కార్డులపై బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు మంజూరు చేయాలి. సాగు ప్రారంభానికి ముందే కార్డుల జారీ, రెన్యువల్స్‌ను పూర్తి చేసి, ఆవెంటనే ఈరుణాలు మంజూరు చేయాలి. కానీ  ఏటా పంటల సాగు సగం పూర్తయ్యే వరకు కార్డులు జారీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఏడాది సీజన్ ముగుస్తున్నా ఓ పక్క కార్డుల జారీ కొనసాగుతూనే ఉంది. అధికారులు ఒత్తిడి తెస్తున్నా..బ్యాంకర్లు మాత్రం కౌలురైతులకు రుణాల మంజూరులో ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.ఏదో ఇచ్చామన్న పేరుకు కొద్దిమందికి రుణాలిచ్చి చేతులు దులుపు కోవడం ఏటా పరిపాటిగా మారింది.      జిల్లాలో గతేడాది 10,432 మంది కౌలురైతులకు రుణ అర్హతకార్డులు (ఎల్‌ఎసీ) జారీ చేయగా వీరిలో 32 మందికి మాత్రమే కేవలం రూ.8లక్షల రుణం మంజూరు చేశారు. ఇక ఈ ఏడాది ఖరీఫ్ ముగిసే నాటికి 20,260 మంది కౌలురైతులకు కనీసం 50కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఇప్పటి వరకు కేవలం 1498 మందికి రూ.2కోట్ల 91లక్షల 81వేల రుణాన్ని మాత్రమే మంజూరు చేశారు. పెందుర్తి, కోటవురట్ల, అరకు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, జీకే వీధి, డుంబ్రిగుడ మండలాల్లో ఏ ఒక్క కౌలురైతుకు  పైసా రుణం ఇచ్చిన పాపాన పోలేదు. అత్యధికంగా మునగపాకలో 165 మందికి రూ.41.89లక్షలు, పాడేరులో 178 మందికి రూ.18 లక్షలు, కశింకోటలో 132 మందికి రూ.28.32లక్షలు, ఆనందపురంలో 94 మందికి రూ.28 లక్షలు, పద్మనాభంలో 83 మందికి రూ.18.93లక్షలు, పాయకరావుపేటలో 53 మందికి రూ.21.30 లక్షలు ఇచ్చారు. మిగిలిన ఏ ఒక్క మండలంలోనూ  పట్టుమని పదిలక్షలు కూడా ఇవ్వలేదు. కార్డులు పొందిన వారంతా దరఖాస్తులు చేసినప్పటికీ బ్యాంకులు మాత్రం రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఏదో కొర్రీలు పెడుతున్నారు. దీంతో జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి నానాటికి తీసికట్టుగాతయారైంది. ఆర్థిక చేయూత లేక ప్రైవేటు వ్యాపారులు, దళారీల వద్ద రూ.5ల వడ్డీకి అప్పులు చేసి మరీ సాగు చేయాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణ భరోసా లేక పోవడంతో కార్డులు తీసుకున్న ప్రయోజనం లేదన్న భావనతో కౌలురైతులు అటువైపు కన్నెత్తయినా చూడడంలేదు. తమ సాగు అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
 
 

మరిన్ని వార్తలు