ఆకతాయికి అధికార పార్టీ అండ

20 Sep, 2015 00:07 IST|Sakshi
ఆకతాయికి అధికార పార్టీ అండ

అవమానంతో వివాహిత ఆత్మహత్య
 
♦ పరిటాల బీసీ కాలనీలో  పెచ్చరిల్లుతున్న అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలు
♦ మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన
 
 కంచికచర్ల : అధికార పార్టీకి చెందిన ఓ ఆకతాయి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం పరిటాలలో జరిగింది. గ్రామానికి చెందిన  వల్లెపు మరియమ్మ(24) ఈ నెల 17వ తేదీ రాత్రి 10 గంటలకు ఇంటి సమీపంలో ఏర్పాటుచేసిన వినాయక పందిరిలో స్వామికి పూజలు చేసి ఇంటికి వెళ్లింది. ఒంటరిగా వెళ్లినట్లు తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చింతల శివకృష్ణ ఆమె ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు. తలుపు తీయగానే చేయి పట్టుకోవడంతో ఆమె కేకలు వేసింది. దీంతో అక్కడి నుంచి పరారయ్యాడు.  ఆ సమయంలో ఆమె భర్త సాంబయ్య ఇంట్లో లేడు.

జరిగిన విషయాన్ని ఆమె స్థానికులకు, బంధువులకు తెలిపి ఆ రాత్రే కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని శివకృష్ణను పట్టుకున్నారు. అయితే అతడిని స్టేషన్‌కు తీసుకువెళ్లకుండా ఎంపీటీసీ సభ్యుడు ఒంటిపులి శివశంకర్, అతని తండ్రి ఏడుకొండలు అడ్డుపడ్డారు. సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా శివకృష్ణపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శనివారం మృతురాలు మరియమ్మ  ఏడుకొండలను కలిసి శివకృష్ణను ఎందుకు దాచి పెడుతున్నారని ప్రశ్నించింది.

శివకృష్ణ తమ పార్టీ కార్యకర్త అని పోలీసులు తీసుకువెళ్లరని, చేతనైంది చేసుకో అంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన మరియమ్మ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు మృతదేహంతో కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. అధికార పార్టీ కార్యకర్తల వేధింపులతోపాటు పోలీసులు నిర్లక్ష్యంతోనే మరియమ్మ ఆత్మహ్యత్య చేసుకుందని స్టేషన్ ఎదుట బైఠాయించారు.

గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు మాగంటి వెంకటరమారావు(అబ్బాయి), చింతా రవీంద్రనాథ్, మార్త శ్రీనివాసరావు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ బండి మల్లికార్జునరావు తదితరులు బాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. నందిగామ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్‌ఐ  కె.ఈశ్వరరావు వైఎస్సార్‌సీపీ నాయకులతో చర్చలు జరిపారు. అనుమానితులపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు చింతల శివకృష్ణ, అతడికి సహకరించిన డేరంగుల అంకరాజు, ఎంపీటీసీ సభ్యుడు ఒంటిపులి శివశంకర్ ఒంటిపుల ఏడుకొండలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ
 విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త  డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింతా రవీంద్రనాథ్, మాగంటి వెంకటరామారావు, మంగునూరు కొండారెడ్డితో పాటు పలువురు నాయకులు మృతురాలి  కుమారులు శ్రీనివాసరావు, శేషులతో పాటు బంధువులను పరామర్శించారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ఆగడాలను అరికట్టాలని జగన్మోహనరావు పోలీసులను కోరారు.

మరిన్ని వార్తలు