-

వైఎస్‌ఆర్‌కు ఆ బ్లూప్రింట్‌ ఇచ్చింది పాదయాత్రే: వైఎస్‌ విజయమ్మ

5 Nov, 2017 15:23 IST|Sakshi

సాక్షి, పులివెందుల: ప్రజలందరి సమస్యలను తెలుసుకునేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని, తన బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రను ప్రజల గుండెల్లో దాచుకొని.. ఆయనను ఆదరించారని ఆమె గుర్తుచేశారు. ప్రజలకు వైఎస్‌ఆర్‌ అందించిన ప్రతి సంక్షేమ పథకం పాదయాత్ర నుంచే పుట్టిందని, సంక్షేమ పథకాల బ్లూప్రింట్‌ను ఆయన పాదయాత్ర నుంచే తయారుచేసుకున్నారని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఆదరించి.. ఆశీర్వదించాలని, ప్రజా సంక్షేమ కోసం ఆయనకు బ్లూప్రింట్‌ ఇవ్వాలని వైఎస్‌ విజయమ్మ అభ్యర్థించారు. పాదయాత్ర సందర్భంగా మీ కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా వైఎస్‌ జగన్‌ను అక్కున చేర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ జగన్‌ సోమవారం నుంచి 'ప్రజాసంకల్పం' పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆదివారం పులివెందులలో వైఎస్‌ విజయమ్మ విలేకరులతో మాట్లాడారు.  ఆమె ఏమన్నారంటే..

  • వైఎస్‌ఆర్‌ పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించారు
  • పాదయాత్రలోనే ప్రజాసంక్షేమ పథకాల బ్లూప్రింట్‌ తయారుచేసుకున్నారు
  • వైఎస్‌ఆర్‌ అమలు చేసిన ప్రతి పథకం పాదయాత్ర నుంచే పుట్టింది
  • పాదయాత్ర తర్వాత వైఎస్‌ఆర్‌ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు
  • పాదయాత్రలో వైఎస్‌ఆర్‌ అనేకమందిని కలిశారు.. రైతులు, మహిళలు, వృద్ధుల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు
  • అధికారంలోకి రాగానే బడుగు వర్గాలకు పెన్షన్‌ నెలానెలా వచ్చేలా చేశారు
  • అధికారం చేపట్టిన తర్వాత ఉచిత విద్యుత్‌ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు
  • పావలా వడ్డీకే రుణాలు, 104, 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అభయహస్తం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి.. ప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్‌ఆర్‌ నిలిచిపోయారు
  • వైఎస్‌ఆర్‌ ఆశయాలు, సంక్షేమ పథకాల అమలు కోసమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టారు
  • కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుతీరును చూస్తే బాధేస్తోంది
  • ఏపీలోనే ఆరోగ్య శ్రీ ఆపరేషన్‌ చేయించుకోవాలని ఆంక్షలు పెట్టారు
  • హైదరాబాద్‌లో ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదు
  • ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతోంది
  • నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని అమలుచేయలేదు
  • ప్రజలు వివేకవంతులు.. వాళ్లకు అన్ని తెలుసు
  • వైఎస్‌ఆర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు పాలనను వారు చూశారు
  • వైఎస్‌ఆర్‌ రోల్‌మోడల్‌గా పనిచేశారు..సీఎం ఎలాంటి మంచి పనులు చేయాలో చేసి చూపించారు
  • ఆ తర్వాత వైఎస్‌లా ప్రజా సంక్షేమానికి ఎవరూ కృషి చేయలేదు
  • వైఎస్‌ హయాంలో 70లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.. చంద్రబాబు వాటిని సగానికి తగ్గించారు
  • వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేకుంటే వైఎస్‌ఆర్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఈరోజు ఉండేవి కావు
  • వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండటం వల్లే వైఎస్ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతోకొంత అమలవుతున్నాయి
  • రాజన్న కూతురిగా, జగనన్న బాణంగా షర్మిలమ్మ పాదయాత్ర చేశారు
  • షర్మిలమ్మ పాదయాత్రతో ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి
  • షర్మిలమ్మ పాదయాత్ర చూశా.. వైఎస్‌ఆర్ పాదయాత్ర చూశా.. ఇప్పుడు ప్రజల పక్షాన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు
  • పాదయాత్ర చేయడం చాలా కష్టంతో కూడుకున్నది, కానీ ప్రజల కోసం జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు
  • వైఎస్ఆర్సీపీకి ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి
  • చంద్రబాబు పాదయాత్ర చేసేటప్పుడు ఏ అనుమతి తీసుకున్నారు
  • వైఎస్‌ జగన్‌ పాదయాత్రను చూసి చంద్రబాబు భయపడుతున్నారు

’వైఎస్‌ఆర్‌’ ప్రతి సంక్షేమ పథకం పాదయాత్ర నుంచే పుట్టింది 

మరిన్ని వార్తలు