పేదింటి ఆణిముత్యం

29 May, 2018 11:41 IST|Sakshi
తల్లిదండ్రులతో సుప్రజ

ఎంబీబీఎస్‌ పీజీ సీటు సాధించిన గౌండ కుమార్తె

నీట్‌లో విద్యార్థిని ప్రతిభ

సుప్రజకు అభినందనల వెల్లువ

నీట్‌లో పేదింటి విద్యార్థిని సత్తా చాటింది. ఎంబీబీఎస్‌లో పీజీ(ఎండీ జనరల్‌ మెడిషన్‌) సీటు సాధించింది. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించి పదిమందికి ఆదర్శంగా నిలిచిన  విద్యార్థిని సుప్రజ ఆశయం.. కుటుంబ నేపథ్యంపై ప్రత్యేక కథనం.

కోవెలకుంట్ల:  కోవెలకుంట్లకు చెందిన ఓబుళపు సూర్యనారాయణరెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గౌండ వృత్తి నిర్వíßహించుకుంటూ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పెద్దకుమార్తె సుప్రజ పదవ తరగతి వరకు పెండేకంటి పబ్లిక్‌ పాఠశాలలో,   విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసుకుని  2011వ సంవత్సరంలో ఎంసెట్‌లో ర్యాంకు సాధించి రాయచూర్‌లోని నవోదయ మెడికల్‌ కళాశాలలో ఎంబీసీబీఎస్‌ పూర్తి చేసింది. 

ఈ ఏడాది నిర్వహించిన నీట్‌పరీక్షలో 5వేలు ర్యాంకు పొంది బెంగుళూరులోని వైదేహి మెడికల్‌ కళాశాలలో పీజీ  సీటు దక్కించుకుంది. చిన్నకుమార్తె ఇందిర ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో  ఉద్యోగం చేస్తోంది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని నీట్‌లో ప్రతిభ కనబరిచి జనరల్‌ మెడిషన్‌ సీటు సాధించడంతో ఆ విద్యార్థినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోటరీక్లబ్‌ మాజీ అధ్యక్షులు బాలాంజనేయరెడ్డి, మోహనమూర్తి, సుబ్బయ్య, శివ, తదితరులు ఆ విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.

పేదలకు సేవచేయాలన్న తపన: సుప్రజ
పేదల కష్టాలను చాలా దగ్గరగా చూశాను. పూట గడవటమే కష్టంగా ఉన్న పేద కుటుంబాల్లోని వ్యక్తులు జబ్బు పడితే  వైద్యం చేయించుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి ఈ స్థాయికి చేరాను. బెంగుళూరులో పీజీ కోర్సు పూర్తి అయ్యాక డాక్టర్‌గా స్థిరపడి పేద ప్రజలకు సేవ చేయాలన్నదే నా ముందున్న లక్ష్యం.  

మరిన్ని వార్తలు