‘మార్గదర్శి’ విచారణపై స్టే ఇవ్వలేం

13 Oct, 2018 05:24 IST|Sakshi

సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ 

మధ్యంతర దరఖాస్తును తోసిపుచ్చిన న్యాయస్థానం 

హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చిన ధర్మాసనం  

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థలో డిపాజిట్ల వ్యవహారంపై ఇక విచారణ కొనసాగించరాదని, ఆ మేరకు ఫస్ట్‌ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్, సిటీ క్రిమినల్‌ కోర్టు–హైదరాబాద్‌లో ఉన్న క్రిమినల్‌ కంప్లయింట్‌పై(సీసీ) స్టే కొనసాగించాలని కోరుతూ దాఖలైన మధ్యంతర దరఖాస్తును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ దరఖాస్తును శుక్రవారం విచారించింది. అవిభక్త హిందూ కుటుంబ సంస్థ(అన్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ బాడీ) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి, డిపాజిట్ల సేకరణకు అర్హత లేకున్నా దాదాపు రూ.2,300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంతో ఇదే చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబరు 19న జీవో నెంబరు 800, జీవో నెంబరు 801ను జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా జీవో నెంబరు 800 ద్వారా అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్‌.రంగాచారిని ఈ ఫైనాన్షియర్స్‌ సంస్థ డిపాజిట్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు నియమించింది. 

అలాగే జీవో 801 ద్వారా అప్పటి సీఐడీ ఐజీ కృష్ణరాజును ఈ సంస్థపై ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేసేందుకు అధీకృత అధికారిగా నియమించింది. ఎన్‌.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 2008 జనవరి 23న ఫస్ట్‌ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో క్రిమినల్‌ కంప్లయింట్‌(సీసీ) నెంబరు 540ను దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సీసీ నెంబరు 540లో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌పై మధ్యంతర స్టే ఇచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఏషియన్‌ రీసర్ఫేసింగ్‌ ఆఫ్‌ రోడ్‌ ఏజెన్సీ ప్రైవేటు లిమిటెడ్‌ వర్సెస్‌ సీబీఐ కేసులో 2018 మార్చి 28న ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ కేసులోనైనా, సివిల్‌ గానీ, క్రిమినల్‌ ట్రయల్‌లో గానీ స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని పేర్కొంది.

విచారణ కొనసాగించడం కంటే స్టే పొడిగించడమే అవశ్యమనుకున్న కేసుల్లో స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. దీని ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో కూడా స్టే ఉత్తర్వులకు కాలం చెల్లింది. ఈ నేపథ్యంలోనే స్టే పొడిగించాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతవారం ఈ మధ్యంతర దరఖాస్తు విచారణకు రాగా ధర్మాసనం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ అభ్యర్థనపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే తాజాగా శుక్రవారం మరోసారి విచారణకు రాగానే కౌంటర్‌ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది పాల్వాయి వెంకటరెడ్డి నివేదించారు. అయితే, మధ్యంతర దరఖాస్తులోని అభ్యర్థనకు అనుగుణంగా స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. సదరు దరఖాస్తును తోసిపుచ్చింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ సివిల్‌ అప్పీల్‌ అని, క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తును సివిల్‌ అప్పీల్‌లో భాగంగా విచారించడం కుదరదని స్పష్టం చేసింది. కాగా పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ అభ్యర్థన మేరకు హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛనిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరపున న్యాయవాది అల్లంకి రమేష్‌ విచారణకు హాజరయ్యారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా