వివరణ ఇచ్చేందుకు సిద్ధం

22 Apr, 2016 02:06 IST|Sakshi
వివరణ ఇచ్చేందుకు సిద్ధం

ఎమ్మెల్యే ఆర్.కె.రోజా
సాక్షి, న్యూఢిల్లీ: తనపై మోపిన అభియోగాలకు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఆర్.కె.రోజా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆమె సుప్రీం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి పోరాడినందుకు నన్ను టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నాకు వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. ఏవిధంగా నన్ను అవమానించారో మీరందరూ చూశారు. ఈరోజు కోర్టులో ప్రభుత్వ న్యాయవాది పీపీ రావు.. ఇదివరకే పిటిషనర్‌కు అవకాశం ఇచ్చామని చెప్పారు. కానీ మాకైతే అవకాశం ఇవ్వలేదు.

నేను చంద్రబాబును కామ సీఎం అన్న విషయాన్ని వాళ్లు తప్పుగా భావిస్తున్నారు. ఆ భాషగా గానీ, ఆ ఉద్దేశంతో గానీ నేను అనలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నా. అప్పట్లో పత్రికలు కాల్‌మనీని కామ అని చెప్పి షార్ట్‌కట్‌లో వేశాయి. కాల్‌మనీపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు తప్ప చంద్రబాబును అగౌరవపరచాలని మేమెప్పుడూ ఆలోచించలేదు. ఇలాంటి చిన్న విషయాలపై వివాదాల కంటే రాష్ట్రం అభివృద్ధిపై దృష్టిపెట్టాలని న్యాయమూర్తులు అన్నారు. నా వివరణ గురించి అడిగారు. నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. మా న్యాయవాదికి కూడా చెప్పాను.

నేను తప్పు చేయలేదు. అనిత విషయంలో కూడా నేను ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యాను. నేను అనని మాటలను సబ్ టైటిల్స్‌గా వేశారని చెప్పాను. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాలని కోరాను. నేను చేయని తప్పుకు నన్ను శిక్షించకండి’’ అని పేర్కొన్నారు. రోజా తరపున మరో న్యాయవాది నర్మదా సంపత్ మాట్లాడుతూ.. ‘‘వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ధర్మాసనం అడిగింది. మేం సిద్ధంగా ఉన్నాం. కేవలం సభా నాయకుడి విషయంలోనే కాకుండా మరో రెండు అభియోగాలకూ ఇది వర్తించాలని కోరాం’’ అని వివరించారు. విచారం వ్యక్తంచేయాల్సిందిగా కోర్టు కోరిందా? వివరణ ఇవ్వాల్సిందిగా కోరిందా? అని మీడియా ప్రశ్నించగా ‘‘ఆమె ఉద్దేశం ఏంటో వివరించాలని చెప్పింది’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు