ఇరు రాష్ట్రాల వివాదమే!

30 Apr, 2015 00:40 IST|Sakshi
ఇరు రాష్ట్రాల వివాదమే!

కృష్ణా జలాల కేటాయింపులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
 
న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరో రాష్ట్రం విడిపోతే నదీజలాల కేటాయింపులను మళ్లీ తిరగదోడుతామా అని ప్రశ్నించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటినే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తే సరిపోతుందేమోనని అభిప్రాయపడింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వల్ల అన్యాయం జరిగిందని, దాన్ని నోటిఫై చేయరాదని ఆంధ్రప్రదేశ్ వేసిన పిటిషన్లు, అసలు ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించేందుకు గతంలో అవకాశం లేనందున  అన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయింపులు జరపాలని తెలంగాణ వేసిన పిటిషన్లను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది.

జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి. పంత్‌లతో కూడిన ధర్మాసనం తొలుత పిటిషన్ల విచారణార్హతపై ఆయా రాష్ట్రాల వాదనలు విన్నది. ముందుగా మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపించారు. ‘బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిమితి ముగిసిన తర్వాత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో అవార్డు ప్రకటించింది. అయితే మూడు రాష్ట్రాలు పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఆ వాదనలు విన్న తర్వాత 2013లో తుది అవార్డు ఇచ్చింది. కానీ కేంద్రం దాన్ని నోటిఫై చేయలేదు. ఇది సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశం.

ఆంధ్రప్రదేశ్ విభజనతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం రెండు రాష్ట్రాల(ఏపీ, తెలంగాణ) మధ్య నీటి కేటాయింపులు జరపాలి. కానీ ఆ రెండు రాష్ట్రాలు తిరిగి కొత్తగా నీటి కేటాయింపులు జరపాలంటున్నాయి. అంటే ఇన్నాళ్లూ ట్రిబ్యునల్ పడిన శ్రమ వృథా అవుతుంది. ఇలా తిరగదోడుతూ పోతే ఎన్నేళ్లు పడుతుంది?  అసలు ఆర్టికల్ 262 ప్రకారం ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డులో సుప్రీంకోర్టు సహా ఏ కోర్టూ జోక్యం చేసుకోజాలదు. అందువల్ల ఇప్పుడు వివాదం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మధ్య పరిమితం కావాలి. అసలు స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్సెల్పీ) ద్వారా ట్రిబ్యునల్ నిర్ణయాన్ని కోర్టులో ఎలా సవాల్ చేస్తారు’ అని అంధ్యార్జున ప్రశ్నించారు.


సుప్రీం గత తీర్పులున్నాయి
ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. ‘గతంలో కృష్ణా, కావేరీ నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 136 ద్వారా సంక్రమించిన అధికారంతో ఈ అంశాల్లోనూ సుప్రీం జోక్యం చేసుకోవచ్చు. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు అశాస్త్రీయం. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని కీలక అంశాలను విస్మరించి కేవలం 65 శాతం నీటి లభ్యతను ప్రాతిపది కగా తీసుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాలను తిరిగి కేటాయించాల్సి ఉంది. పొడిగించిన గడువు మేరకు ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

దీనిపై మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున అభ్యంతరం వ్యక్తంచేశారు. సుప్రీం గత తీర్పులు నీటి కేటాయింపులకు సంబంధించినవి కావని, కోర్టు జోక్యం తగదని పేర్కొన్నారు. ఇంతలో కర్ణాటక తర ఫున సీనియర్ న్యాయవాది నారీమన్ వాదనలు వినిపించారు. ‘ఆర్టికల్ 369 ప్రకారం ఎన్నికల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోజాలవు. అదే రీతిలో ట్రిబ్యునల్ విషయంలో కూడా వర్తిస్తుంది’ అని వివరించారు. విచారణార్హతపై వాదనలు విన్న అనంతరం ఆర్టికల్ 131, 136 ప్రకారం కోర్టు ఈ వివాదాన్ని విచారించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వాటిని విచారణకు స్వీకరిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వకుండానే వాటిలోని అంశాల యోగ్యతపై తిరిగి వాదనలు విన్నది.


47 ఏళ్ల వివరాలే తీసుకున్నారు..
బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు ప్రభావంపై ఏపీ లాయర్ గంగూలీ వాదనలు వినిపించారు. ‘బచావత్ అవార్డులో 78 ఏళ్ల సగటు నీటి లభ్యత గణాంకాల ఆధారంగా నీటి లభ్యతను 75 శాతంగా తీసుకున్నారు. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ కేవలం 47 ఏళ్ల సగటును తీసుకుని 65 శాతం నీటి లభ్యత మాత్రమే ఉందని లెక్కగట్టింది. ఇలా లెక్కించినప్పుడు ఎగువ రాష్ట్రాలకు మాత్రమే నీటి లభ్యత ఉంటుంది. అసలే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవలసి వస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేస్తూ..  కేటాయింపులు జరిపాక సమస్య ఏముంటుందని ప్రశ్నించారు. అప్పుడు గంగూలీ బదులిస్తూ.. అసలు నీళ్లే కిందికి రానప్పుడు కేటాయింపులు ఉన్నా లేకున్నా ఒకటేనని, అదే ఇప్పుడున్న సమస్య అని వివరించారు.

రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు..
తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. ‘ఇప్పటికే రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీటి వసతి లేక విలవిల్లాడుతున్నారు. 65 శాతం నీటి లభ్యత వల్ల తెలంగాణకు, ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోంది’ అని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరపకుండా ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారణ సాధ్యం కాదని వాదించారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. అయితే అది ట్రిబ్యునల్ నిర్ధారించాకే కోర్టుకు రావాలని వ్యాఖ్యానించారు.


దీంతో ఈ వివాదానికి నిర్దేశిత కాలపరిమితిలో ముగింపు పలకాల్సిన అవసరముందని రాష్ట్రాలన్నీ అభ్యర్థించాయి.  తిరిగి ధర్మాసనం కల్పించుకుని.. ‘సెక్షన్ 89ను మనం ఎలా చూడాలి? ఒక రాష్ట్రం విడిపోతే అప్పులు, ఆస్తులు పంచుకున్నట్టే నీళ్లు కూడా పంచుకోవాలి. అంతేకదా?’ అని అన్నారు. ‘ఉదాహరణకు చట్టం ప్రకారం ఒక వారసుడు తన తండ్రి నుంచి గానీ, తన తల్లి నుంచి గానీ ఆస్తులను కోరతాడు గానీ ఇతరుల నుంచి కోరడు కదా? సెక్షన్ 89ను మనం ఎలా చూడాలన్నదే ఇక్కడ ప్రశ్న’ అంటూ విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
 
 
రెండు రాష్ట్రాల మధ్యే కావొచ్చు...
వాదనలు మొదలయ్యే ముందు జస్టిస్ దీపక్ మిశ్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విభజన చట్టంలోని సెక్షన్ 89ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్‌కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులనే ఇప్పుడు రెండు రాష్ట్రాలు(ఏపీ, తెలంగాణ) పంచుకోవాల్సి ఉంటుందేమో? లేదంటే రేపు మరో రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్లీ తిరగదోడలేం కదా? ప్రాథమికంగా వ్యవహార జ్ఞానంతో చూస్తే అంతే అనిపిస్తోంది’ అని అభిప్రాయపడ్డారు.


దీనిపై తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టులవారీగా నీటి విడుదలను నిర్ధారించాలంటే కేవలం కింది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు నిర్ధారిస్తే సరిపోదని, ఎగువ రాష్ట్రాలు నీటిని పూర్తిగా వాడుకుంటే కిందికి ఎలా వస్తాయని ప్రశ్నించారు. సెక్షన్ 89 సంగతి ముందు తేల్చాలని కోరారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘సెక్షన్ 89 ప్రకారం ఉండాల్సిన విధివిధానాలను ట్రిబ్యునల్ విచారిస్తోంది. అంతవరకు పరిమితమవ్వాలనుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎస్సెల్పీలు అవసరమే లేదు. అన్ని రాష్ట్రాల వాదనలు వింటాం’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు