సాంకేతికమక

13 Sep, 2014 02:11 IST|Sakshi

ఒంగోలు వన్‌టౌన్: ఇంజినీరింగ్ ప్రవేశాలపై గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇంజినీరింగ్ అభ్యర్థులకు పిడుగుపాటైంది.  ప్రవేశాలలో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో వేలాది మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించే అవకాశం కనిపించడం లేదు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో అతి తక్కువ మంది విద్యార్థులు చేరినా రెండో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు చేరతారన్న ఆశతో ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలకు తీవ్ర నిరాశ ఎదురైంది.

రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడడం ఇదే ప్రథమం. జిల్లాలో కూడా సుమారు నాలుగు వేల మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించినప్పటికీ ప్రవేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌పై ఆశతో ఉన్న విద్యార్థులు, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

 ప్రభుత్వ ప్రకటనల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నిప్పులు చెరుగుతున్నారు. ప్రవేశాల విషయంలో తాపీగా నిర్ణయాలు తీసుకుని పొంతన లేని ప్రకటనలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంపెడాశతో ఉన్న అభ్యర్థులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆందోళనకు గురవుతున్నారు.

 మిగిలిన సీట్ల భర్తీ హుళక్కేనా...
 సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లు భర్తీకావడం అనుమానమే. జిల్లాలోని 17 ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్ని కోర్సుల్లో కలిపి మొత్తం కన్వీనర్ కోటాలో 6,845 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్‌లో 3,925 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు లభించాయి.

కళాశాలల్లో ఇప్పటికి ఇంకా 2,920 సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి. అంటే జిల్లాలో కన్వీనర్ కోటాలోని మొత్తం 57.34  శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 42.66 శాతం సీట్లు మిగిలిపోయాయి. జిల్లాలో ఒక్క కళాశాలలో మాత్రమే 100 శాతం సీట్లు భర్తీ కాగా, మూడు కళాశాలల్లో 90 శాతం పైగా ప్రవేశాలు జరిగాయి. ఒక కళాశాలలో 336 సీట్లుకు గాను కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే చేరారు.

 జిల్లాలోని కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లు గత అనుభవాల ప్రకారం రెండో విడత కౌన్సెలింగ్‌లోనే భారీగా భర్తీ అవుతున్నాయి. ఈ సారి రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడంతో ఆ సీట్లన్నీ మిగిలిపోయే ప్రమాదం పొంచిఉంది. జిల్లాలో 8 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతం సీట్లలోపు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే కనీసం 80 శాతంసీట్లు భర్తీ కాకపోతే కళాశాల నిర్వహించడం యాజమాన్యాలకు ఆర్థిక భారమవుతుంది.

 విద్యార్థుల్లో భయం భయం...
 ఇంజినీరింగ్ ప్రవేశాలలో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెబ్ కౌన్సెలింగ్ రాక పూర్వం విద్యార్థులు నేరుగా హెల్ప్‌లైన్ సెంటర్లలో కౌన్సెలింగ్‌కు హాజరై తమకు నచ్చిన కళాశాల, కోర్సులో ప్రవేశం పొందేవారు.

 ప్రస్తుతం నిర్వహిస్తున్న వెబ్ ఆప్షన్ల వల్ల విద్యార్థులు తాము కోరుకున్న కళాశాలలో సీటు రాకపోయినా నచ్చిన బ్రాంచ్‌లో ప్రవేశం దక్కకపోయినా మళ్లీ నిర్వహించే రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో తాము కళాశాల మారేందుకు, తమ బ్రాంచ్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది కేవలం రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్‌ను నమ్ముకుని మొదటి విడత కౌన్సెలింగ్‌లో వచ్చిన కళాశాలల్లో ప్రవేశించలేదు. ప్రభుత్వమే రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని, మొదటి విడతలో సీటు లభించనివారు రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందవచ్చని నమ్మబలికారు.

మొదటి కౌన్సెలింగ్‌లో ప్రవేశం వచ్చిన కళాశాల నచ్చకపోతే కళాశాలలో చేరవద్దని, రెండవ విడత కౌన్సెలింగ్‌లో నచ్చిన కళాశాలలో చేరవచ్చని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా మొదటి కౌన్సిలింగ్‌లో సీట్లు లభించిన కళాశాలలో ఇవ్వవద్దని, వాటిని తమవద్దనే ఉంచుకుని రెండో విడత కౌన్సెలింగ్‌లో అవసరమనుకుంటే బ్రాంచ్‌ను, కళాశాలను మార్చుకోవచ్చని ఊదరగొట్టారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి ఇవేమీ విద్యార్థులకు అక్కరకు రాకుండా పోయాయి. తాము కోరుకున్న కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభిస్తుందన్న ఆశతో కేవలం ఒక్క కళాశాలకే వెబ్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులు ఆ కళాశాలలో సీటు లభించకపోవడంతో ప్రస్తుతం రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశంలేదని తేలిపోవడంతో లబోదిబోమంటున్నారు.

 ఫీజు రీయింబర్స్‌మెంటే అసలు సమస్య
 ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వాలు చొరవచూపి సత్వర చర్యలు చేపట్టనందువల్లే ఇంజినీరింగ్ ప్రవేశంలో అసాధారణ జాప్యం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంసెట్ ఉమ్మడి ప్రవేశాల వల్ల సమస్యలు తలెత్తాయి. ఎంసెట్ ర్యాంకులు ప్రకటించిన మూడు నెలలకు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేనేజ్‌మెంట్ కోటా (బి కేటగిరీ) సీట్లులో ప్రవేశించే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించదు.

 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 31 నాటికి ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా అన్నింటిలో ప్రవేశాలు పూర్తి కావాలి. అయితే ఇక్కడి ఉన్నత విద్యా మండలి బి కేటగిరీలో ప్రవేశాలకు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలపై నమ్మకంతో కన్వీనర్ కోటాలో ప్రవేశానికి ర్యాంకు వచ్చినా వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు కూడా తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

 ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని స్పాట్ అడ్మిషన్లకు అనుమతిస్తే తప్ప విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశం లేదు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ప్రస్తుతం అడ్మిషన్లు లభించని విద్యార్థులను హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా కానీ, లేదా నేరుగా ఇంజినీరింగ్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లుకు అనుమతించి వారికి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే తప్ప బలహీన వర్గాల విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడం కష్టమే. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో వేచి చూడాలి.

 

మరిన్ని వార్తలు