పోడు కత్తి

1 Jul, 2019 10:09 IST|Sakshi
పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు

 సుప్రీం తీర్పుతో గిరిజనుల ఆందోళన

 పోడు భూముల పట్టాల కోసం నిరీక్షణ  

 జూలై 27 గడువు తేదీతో సర్వత్రా సందిగ్ధం  

పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న పలువురు సన్న, చిన్నకారు గిరిజన రైతులకు పెద్ద సమస్య వచ్చిపడింది. భూములకు పట్టాలివ్వాలని రైతులు ఆందోళన చేస్తుంటే.. ‘అసలు వారు ఆ భూములకు హక్కుదారులుకారు.. వారిని భూముల నుంచి తొలగించాలి’ అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఆదివాసీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 

సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి) : 2005లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ సమయంలో సుమారు 15 వేల మందికిపైగా నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భూములు పంచి పట్టాలిచ్చారు. ఆయన మరణం తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు రాలేదు. గ్రామ సభలు సక్రమంగా జరగకపోవడం వల్ల దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల రిటైర్డ్‌ ఫారెస్ట్‌ ఉద్యోగి, వన్యప్రాణి సంరక్షణకు చెందిన కొందరు ప్రతినిధులు సుప్రీంకోర్టులో అటవీ సంరక్షణపై కేసు వేశారు. దీంతో 2005 అటవీ హక్కుల చట్టం తర్వాత వచ్చిన క్లెయిమ్స్‌ను తిరస్కరించడంతోపాటు ఆ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయించేందుకు 2019 జులై 27వ తేదీని గడువుగా సుప్రీం కోర్టు ప్రకటించింది. 

పట్టాలివ్వాలని ఆందోళన 
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను తరిమేయడం సరికాదని, వారికి పట్టాలిచ్చి న్యాయం చేయాలని గిరిజన, ప్రజా సంఘాల నాయకులు, గిరిజనులు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే సమయం దగ్గర పడుతున్నందున తమ పరిస్థితి ఏంటని గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోడు భూమే తమకు జీవన ఆధారమని, అదికాస్తా పోతే తమ బతుకులు ఛిద్రమవుతాయని ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోడు భూముల పట్టాల వ్యవహారాలకు సంబంధించి గ్రామసభలు నిర్వహించి వాటిని సాగు చేస్తున్న రైతులు అటవీ హక్కుల చట్టానికి అర్హులాకాదా అని తేల్చాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు గ్రామ సభలను తూతూమంత్రంగా నిర్వహించారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో వేలాది మంది పోడు భూములు సాగు చేసుకునేవారు ఉన్నప్పటికీ అధికారులు శ్రద్ధచూపకపోవడం వల్ల తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం ఉందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.

ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సాగులో ఉన్న హక్కుదారులకు పట్టాలకు కల్పించకపోతే అనేక గిరిజన కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత వచ్చిన తీర్పు ప్రకారం జులై 27వ తేదీ నాటికి గ్రామ సభలను నిర్వహించి అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా పట్టాలు ఇవ్వాలి. లేకుంటే భూముల నుంచి గిరిజనులను గెంటేసే అవకాశం ఉంది. అధికారులు చొరవ తీసుకొని గడువు దగ్గర పడుతున్నందున గిరిజనులకు న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

జిల్లాలో 15 వేల ఎకరాల్లో పోడు భూమిసాగు
జిల్లాలోని ఏజెన్సీ మండలాలతోపాటు టి. నర్సాపురం, చింతలపూడి, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో 5,738 మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. అయితే అటవీ హక్కుల చట్టంలో వీరంతా దరఖాస్తు చేసుకున్నా.. ప్రస్తుతం తిరస్కరణకు గురైనట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రా>మసభలు నిర్వహించి రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తే పట్టాలిచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు గ్రామసభలు నిర్వహించకపోవడం వల్ల పోడు భూముల సాగుదారులు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా