‘సుప్రీం’ త్రిసభ్య కమిటీ రాక

22 Aug, 2014 00:16 IST|Sakshi
‘సుప్రీం’ త్రిసభ్య కమిటీ రాక
  •     నేడు జిల్లాలో పర్యటించనున్న  బృంద సభ్యులు
  •      పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలనే ధ్యేయం
  •      అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు
  • సిరిపురం (విశాఖపట్నం): విద్యాహక్కు చట్టం ప్రకా రం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగాలేవన్న ఫిర్యాదు మేరకు అశోక్‌గుప్తా, టి.వి.రత్నం, గున్నం వెంకటేశ్వర్రావులతో కూడిన సుప్రీం కోర్టు న్యాయవాదుల త్రిసభ్య కమిటీ గురువారం నగరానికి చేరుకుంది. జిల్లాలో చాలా పాఠశాలలకు మరుగుదొడ్లు లేవన్న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నివేదిక నేపథ్యంలో శుక్రవారం పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతులను కమిటీ పరిశీలించనుంది.

    అయితే కమిటీ ఏ ఏ పాఠశాలలను పరిశీలి స్తుందనే విషయం గోప్యంగా ఉంచినప్పటికీ సర్వశిక్షా అభియాన్ అధికారులు మాత్రం మూడు రూట్లను సిద్ధం చేశారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న పాఠశాలల్లో మరుగుదొడ్లను మాత్రం శుభ్రం చేసేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను అప్రమత్తం చేశారు.  నిబంధనల ప్రకారం 80 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలి. జిల్లాలో పదిమంది కన్నా తక్కువ మంది పిల్లలున్న పాఠశాలలు ఉన్నాయి. 200మంది కన్నా ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి.
     
    పిల్లలు ఎంతమంది ఉన్నారనే విషయం పక్కనపెట్టి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు 3,375 పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లు లేవు అన్న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నివేదిక నేపథ్యంలో ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పూర్తిగా టా యిలెట్లు లేని 1034 పాఠశాలలకు 1738 టాయిలెట్ యూనిట్లు జనవరిలో మంజూరుచేశారు. వీటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నట్టు తెలుస్తోంది.
     
    అలా చేస్తే మంచిదే
     
    పట్టణాల్లో టాయిలెట్స్ నిర్వహణ బాధ్యతను జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది చూసుకోవాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావు అన్ని పట్టణాల పురపాలక, నగరపాలక కమిషనర్‌లకు, డీఈఓలకు, ఎస్‌ఎస్‌ఏ పీఓలకు 12175/జి1/2014 మోమో జారీ చేయడంతో టాయిలెట్ల నిర్వహణ మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మెమోను అమలు చేయాలని సుప్రీంకోర్టు కమిటీని కోరనున్నారు. దీంతోపాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల  పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత స్కూల్ మోనటరింగ్ కమిటీలు లేదా డ్వాక్రా సంఘాలకు అప్పగించేలా చర్యలు చేపడితే బాగుంటుందన్న ఆలోచనలో విద్యాశాఖాధికారులున్నట్టు తెలుస్తోంది.  
     
    మూడు రూట్లు సిద్ధం

     
    జిల్లాకు రానున్న సుప్రీంకోర్టు బృందాన్ని తీసుకెళ్లేందు కు ఎస్‌ఎస్‌ఏ అధికారులు మూడు రూట్‌లు సిద్ధం చేశా రు. విశాఖ నుంచి ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం మీదుగా పెందుర్తి, చోడవరం, సబ్బవరం, పాడేరు వెళ్లే మార్గం ఒకటి... విశాఖ నుంచి ఎన్‌ఏడీ, గాజువాక మీదుగా అగనంపూడి, అనకాపల్లి, నర్సీపట్నం, అచ్చుతాపురం, రోలుగుంట, రావికమతం, మీదుగా మరొకటి... విశాఖ నుంచి కంచరపాలెం, మద్దిలపాలెం, సాగర్‌నగర్ మీదుగా భీమిలి, ఆనందపురం ఒకటి. అయితే కమిటీ సభ్యులు వీరు సిద్ధం చేసిన రూట్లలో వెళతారా లేక వారు ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకొని వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.
     

మరిన్ని వార్తలు