ప్రాక్టికల్స్‌ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

5 Feb, 2020 13:37 IST|Sakshi
డీకేడబ్ల్యూలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

నెల్లూరు (టౌన్‌): ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జరుగుతున్న కేంద్రాల్లో పలువురు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన మాల్‌ ప్రాక్టీస్‌ కథనంపై అధికారులు స్పందించారు. ప్రాక్టికల్స్‌ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ సభ్యుడు నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను పరిశీలించారు. ఏ కళాశాల నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ప్రాక్టికల్స్‌ అంటే ఏమిటి.. ఏడాదికి మొత్తం ఎన్ని ప్రాక్టికల్స్‌ ఉంటాయని పలువురు విద్యార్థులను ప్రశ్నించారు.

అయితే ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాక్టికల్స్‌ జరుగుతున్న కేంద్రాలకు ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన వ్యక్తులు ఎందుకొస్తున్నారని ఆర్‌ఐఓ శ్రీనివాసులును ప్రశ్నించారు. ప్రాక్టికల్స్‌లో స్కిల్‌ పర్సన్ల పాత్ర ఏమిటని అడిగి తెలుసుకున్నారు. వారు పరీక్షలు జరుగుతున్న గదికి ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్స్‌లో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌కు సహకరించారని రుజువైతే అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలోని అన్ని కళాశాలలను తనిఖీ చేస్తామన్నారు. 

జేసీ – 2 కమలకుమారి తనిఖీలు
నగరంలోని కేఏసీ, డీకేడబ్ల్యూ కళాశాలలను కలెక్టర్‌ ఆదేశాల మేరకు జేసీ – 2 కమలకుమారి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాక్టికల్స్‌ జరుగుతున్న అన్ని గదులను పరిశీలించారు.    

అవకతవకలు జరిగితే కఠిన చర్యలు
నెల్లూరు (టౌన్‌): ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సభ్యుడు నారాయణరెడ్డి హెచ్చరించారు. స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించేందుకు కొన్ని కళాశాలలు డబ్బులు వసూలు చేసినట్లు తనకు ఫిర్యాదు అందిందని చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కళాశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నామని హెచ్చరించారు. జంబ్లింగ్‌ విధానంలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలు, కళాశాలలపై ఫీజుల నియంత్రణకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజుల నియంత్రణ అమలు బాధ్యతను కమిషన్‌కు అప్పజెప్పిందన్నారు. వచ్చే నెల నుంచి కళాశాలలను తనిఖీ చేసి లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌ఐఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆగ్రహం
ప్రాక్టికల్స్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై కలెక్టర్‌ శేషగిరిబాబు సీరియస్‌ అయ్యారని తెలిసింది. పసిగట్టిన ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని కేంద్రాల్లో గేట్లు మూయించారు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని కేంద్రాల వద్ద పోలీసుల పహారా కనిపించింది.

మరిన్ని వార్తలు