నిఘా నీడలో..

7 Jun, 2014 02:25 IST|Sakshi
నిఘా నీడలో..
  • వీవీఐపీలకు మూడంచెల భద్రత
  •  వీఐపీల బస వద్ద ప్రత్యేక బృందాలు
  •  ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి
  •  సీమాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడలో పోలీసు నిఘా భారీగా పెంచారు. వీవీఐపీలు, వీఐపీలు బసచేసే ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు ముమ్మరం చేశారు.  
     
    విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడలో నిఘా భారీగా పెరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ జాతీయ పార్టీల అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రముఖులు (వీవీఐపీ), ప్రముఖులు (వీఐపీ)లు బసచేసే ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఐజీలు ఎన్‌వీ సురేంద్రబాబు, గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు భద్రత చర్యలపై దృష్టిసారించారు.

    శనివారం ఉదయంలోగా అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులకు హాజరుకానున్నారు. నగర పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ, ప్రత్యేక బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. నగర పోలీసు కమిషనరేట్‌లో 10 కంపెనీల సీఆర్‌పీఎఫ్, 2 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలు అందుబాటులో ఉన్నాయి. మరో 20 ప్లాటూన్ల బలగాలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. పొరుగు జిల్లాల పోలీసులను కూడా అందుబాటులో ఉంచారు.
     
    రెండువేల మందితో విడిది కేంద్రాలకు భద్రత..

    పలువురు ప్రముఖులు అతిథి గృహాలు, ప్రముఖ హోటళ్లలో బస చేయనున్నారు. శనివారం నుంచే వీరు వచ్చే అవకాశముంది. ఆయా వ్యక్తుల హోదాను బట్టి అతిథి గృహాలు, హోటళ్లను రెవెన్యూ అధికారులు కేటాయిస్తున్నారు. గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ల వద్ద రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

    ఆయా ప్రముఖులను కలిసేందుకు వచ్చేవారిని నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించనున్నారు. వీరు బసచేసే ప్రాంతాల్లో భద్రత చర్యల్లో భాగంగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. బస కేంద్రాలకు సమీపంలో నివసించే వారి వివరాలు సేకరించారు. కొత్తగా వచ్చిన వారి వివరాలను సైతం పోలీసు అధికారులు తీసుకుని విచారణ జరుపుతున్నారు.
     
    వీఐపీల కాన్వాయ్‌లు సిద్ధం..

    కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే ప్రముఖుల కాన్వాయ్‌లను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా జరిగింది. శనివారం మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏ కాన్వాయ్‌లో ఎవరు విధులు నిర్వహించాలనే విషయాన్ని అధికారులు ఖరారు చేశారు.
     
    కంట్రోల్ రూం..

    గన్నవరం విమానాశ్రయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రముఖుల రాకపోకలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు. తద్వారా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
     
    ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యిమంది..
     
    విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యిమందిని వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారుల ప్రత్యేక పర్యవేక్షణలో దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించనున్నారు. పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రమాణ స్వీకారం రోజున ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపట్టారు.

    బెజవాడతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మీదుగా ఏ విధమైన వాహనాలూ రాకుండా గుంటూరు, ఒంగోలు, హనుమాన్‌జంక్షన్, రాజమండ్రి ప్రాంతాల మీదుగా ట్రాఫిక్ మళ్లించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం గన్నవరం నుంచి విశ్వవిద్యాలయం వరకు వెళ్లే మార్గంలో అనుమతి ఉంటేనే వాహనాలను పంపుతారు.

    ఆరోజు ఆ మార్గంలో ఏ విధమైన ప్రయాణాలూ పెట్టుకోరాదంటూ ఇప్పటికే ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నందున కీలక ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర నిఘా బృందాలు విజయవాడలో బస చేసే ఆయా ప్రాంతాలపై దృష్టిసారించాయి.

మరిన్ని వార్తలు