కుశలమా.. నీవు కుశలమేనా?

27 May, 2018 10:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒంగోలు టౌన్‌ : జిల్లాలోని ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారా..? లేకుంటే దుఖంగా ఉన్నారా..? అనే విషయమై జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది. హ్యాపీనెస్‌ సర్వే పేరుతో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు సర్వే నిర్వహించనుంది. వివిధ రంగాలకు చెందిన వారి నుంచి వివరాలను సేకరించనుంది. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1500 మందిని ఎంపిక చేసుకొని వారి నుంచి ఐదురకాల అంశాల ద్వారా వారి స్థితిగతులను తెలుసుకొని అత్యంత ఆనందంగా ఉన్నారా..? విచారంతో ఉన్నారా..?అనే వివరాలను తెలుసుకోనుంది. ఈ సర్వే నిర్వహణ బాధ్యతలను మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో సహాయ గణాంకాధికారులుగా 

పనిచేస్తున్న వారికి అప్పగించింది. వారివద్ద ఉన్న ట్యాబ్‌లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు సర్వేకు సంబంధించిన అప్లికేషన్‌ అప్‌లోడ్‌ చేశారు. దీంతో సహాయ గణాంకాధికారులు ఏరోజుకారోజు తాము నిర్వహించిన సర్వే వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మూడురోజులపాటు జరగనున్న సర్వే ప్రక్రియను ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయ గణాంకాధికారులకు సలహాలు, సూచనలు అందించనున్నారు.

సర్వే నిబంధనలు..
జిల్లాలో హ్యాపీనెస్‌కు సంబంధించిన నిర్వహించనున్న సర్వేలో ఐదురకాల అంశాలను ప్రామాణికంగా తీసుకొని సహాయ గణాంకాధికారుల బృందం వివరాలను సేకరించాల్సి ఉంటుంది. 

  •  
    ఎంపిక చేసుకున్న కుటుంబాలకు వెళ్లిన సమయంలో ఆ కుటుంబ యజమానితో మాట్లాడాలి. వివరాలు సేకరించే సమయంలో కుటుంబ యజమాని తప్పనిసరిగా ఉండాలి. 

  • సర్వేలో 50 శాతం పురుషులు, 50 శాతం మహిళలు తప్పనిసరిగా ఉండాలి.

  • ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని సర్వే చేపట్టాల్సి ఉంది. 

  • ఎంపిక చేసుకున్న ఒక్కో గ్రామంలో ఆరు శాంపిల్స్‌ తక్కువ కాకుండా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. 

  • వివరాలు సేకరించే వ్యక్తుల వయస్సు 15 ఏళ్ల పైబడి ఉండాలి. 

  • ఒక ఉద్యోగి, ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి, నిరుద్యోగి తప్పనిసరిగా ఉండాలి. 
  • బేల్దారి మేస్త్రి మొదలుకొని హోల్‌సేల్‌ వ్యాపారం చేసేవారి అభిప్రాయాలు తప్పనిసరిగా సర్వేలోపొందుపరచాల్సి ఉంటుంది. 

వివరాలు సేకరించే ఐదు అంశాలు ఇవే..

  • సంతోషంగా ఉన్నారా..? లేదా? 
  • ఆర్థికపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తి బంధువులు లేదా స్నేహితులు ఏమైనా సహాయం చేస్తారా..? లేదా..?
  •  సంతృప్తికరంగా జీవిస్తున్నారా..? అసంతృప్తితో ఉన్నారా..? 
  • గడచిన నెలలో ఏదైనా ఛారిటీకి ఆర్థిక సహాయం చేశారా, ఏవరైనా ఇబ్బందుల్లో ఉంటే నగదు సహాయం అందించారా లేదా..? 
  • ప్రభుత్వ కార్యాలయాల్లో, వ్యాపార కార్యకలాపాల్లో ఎక్కడైనా అవినీతి జరుగుతోందా, ఒకవేళ జరుగుతుంటే ఏ స్థాయిలో జరుగుతోంది?

సర్వే పక్కాగా నిర్వహించాలి..
జిల్లాలో హ్యాపీనెస్‌ సర్వేను పక్కాగా చేపట్టాలని ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఆదేశించారు. శనివారం స్థానిక వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలోని సహాయ గణాంకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్వేకు సంబంధించిన ప్రామాణికాలను కచ్చితంగా పాటించాలన్నారు. సమస్య తలెత్తకుండా నిర్ణీత వ్యవధిలోగా వివరాలు అందించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు