గొలుసు.. మామూళ్లతో కొలుచు..!

22 Jul, 2019 14:26 IST|Sakshi

ముడుపులు ముడితేనే సర్వే 

ఎక్కడి దరఖాస్తులు అక్కడే 

3,440 ఎఫ్‌ఎంబీల గల్లంతు  

జిల్లా సర్వే, భూమి రికార్డుల విభాగం తీరు 

కొద్దినెలల క్రితం దేవనకొండ మండలంలో భూమి సర్వే కోసం రైతులు జిల్లా సర్వే ఏడీని ఆశ్రయించారు. దీంతో ఆయన సంబంధిత సర్వేయర్‌కు ఫోన్‌ చేసి తక్షణం సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే అయితే చేశారు కాని ముడుపులు మాత్రం వదలలేదు. ఏడీ సార్‌ చెప్పినారు కదా అంటే వాళ్లు చెబుతుంటారు. మాకు ఇవ్వాల్సిందే అంటూ మామూళ్లు వసూలు చేశారు. ఇటీవల డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు ఫోన్‌ చేసి సర్వే కోసం సర్వేయర్‌  రూ.9వేల లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు  తిరిగి ఇప్పిస్తానని కలెక్టర్‌ వీరపాండియన్‌ హామీ ఇచ్చారు. కలెక్టర్‌ దృష్టికి పోవడంతో సర్వేయర్‌ తీసుకున్న మామూళ్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.  

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌): సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా..కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సమస్యల పరిష్కారానికి డబ్బులు డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మంటకలుపుతున్నారు.  సర్వే విభాగంలో ఈ తంతు సాగుతోంది. మామూళ్లు ఇవ్వందే సిబ్బంది గొలుసు పట్టడం లేదు. ఈ విభాగంలో ఫీల్డ్‌ మెజర్‌మెంటు బుక్‌ (ఎఫ్‌ఎండీ)లు గల్లంత కావడం చర్చనీయాంశమైంది. ఇవి లేకపోతే భూ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం లేదు. ఇటువంటి వాటిని భద్రపరచాల్సిన అవసరం ఎంతో ఉన్నా సర్వే, భూమి రికార్డుల విభాగం తగిన చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సర్వేకు సంబంధించి 61 సమస్యలు వచ్చాయి. ఇందులో కేవలం 2 మాత్రమే పరిష్కరించారు. 

3440 ఎఫ్‌ఎంబీలు గల్లంతు.. 
జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా 4,87,761 సర్వే నంబర్లు (ఎఫ్‌ఎంబీలు) ఉన్నాయి. వీటిని డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఎఫ్‌ఎంబీలను డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందులో 3440 ఎఫ్‌ఎంబీలు గల్లంతు అయ్యాయి. భూ సమస్యలకు ప్రధాన ఆధారం ఎంఎంబీనే. ఇందులో పొలంలో ఎక్కడెక్కడ ఎన్ని గొలుసులకు సర్వే రాళ్లు ఉండేది స్పష్టంగా ఉంటుంది. సర్వేకు ఎఫ్‌ఎంబీనే ఆధారం. ఇవే లేవంటే సర్వే విభాగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టమవుతోంది. గల్లంతు అయిన ఎఫ్‌ఎంబీలు ఎవ్వరి దగ్గరైన ఉంటే తెచ్చి ఇవ్వాలని సర్వే అధికారులు కోరారు. అయితే స్పందన లేదు. గల్లంతైన ఎఫ్‌ఎంబీలను మళ్లీ తయారు చేసి  డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది. మామూలుగా అయితే జూన్‌ నెల చివరికే ఈ తంతు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 

వారి రూటే సప‘రేటు’
ముడుపులు ముట్టచెప్పిన వారికి సర్వే చేస్తూ... మిగిలిన దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో శాంక్షన్‌ పోస్టులకు అనుగుణంగా సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారు. అంతేగాక 200 మంది వరకు లైసన్స్‌డ్‌ సర్వేయర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సర్వే సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉండిపోయాయి. లైసన్స్‌డ్‌ సర్వేయర్లు మొదలు కొని డిప్యూటీ సర్వేయర్లు, సర్వేయర్లు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకరాకు ఇంత చొప్పున రేటు నిర్ణయించారు. ఈ ప్రకారం ముట్టచెబితేనే సర్వేయర్లు గొలుసుపడుతారు. సాక్షాత్తు జిల్లా సర్వే అధికారులు చెప్పినప్పటికీ ముడుపులు తీసుకోకుండా సర్వే చేయరంటే అతిశయోక్తి కాదు.  

మరిన్ని వార్తలు