చిరు ఆసరాపై పెనుగాభరా

20 Sep, 2014 03:43 IST|Sakshi
చిరు ఆసరాపై పెనుగాభరా

- పింఛన్ సర్వే కేంద్రాలకు ఎగబడ్డ లబ్ధిదారులు
- భారీవర్షంలోనూ వృద్ధులు, వికలాంగుల ఉరుకులు
- తొలిరోజు జరిగింది 25 శాతం పరిశీలనే
- అస్తవ్యస్తంగా, హడావుడిగా సాగిన ప్రక్రియ
- ఎన్నడో ‘చెరిగిన బొటు’కు సర్టిఫికెట్ అడగడంతో
- కలత చెందుతున్న వితంతువులు
సాక్షి, రాజమండ్రి / మండపేట : పూలవాన కురిపిస్తామని బులిపించి, అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు సర్కారు.. అనంతరం బడుగుల బతుకుల్లో పిడుగులు కురిపిస్తోంది. మాఫీ మాయ నాటకంలో రోజుకో ఆటంకపు అంకాన్ని రచిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పింఛన్‌ల మొత్తం పెంపు వాగ్దానం అమలుకు ముందు అసలుకే ఎసరు పెట్టే తంతును మొదలు పెట్టింది. బతుకు పడమటి పొద్దున పండుటాకులకు, విధి వెక్కిరించిన   వికలాంగులకు, వితంతువులకు పీడకలలా పింఛన్ల సర్వేను ప్రారంభించింది. సకాలంలో వెళ్లి తమ పత్రాలు చూపకపోతే గోరంత ఆసరాను ఎక్కడ రద్దు చేస్తారోనన్న కొండంత ఆందోళనతో.. పింఛన్‌దారులు కుండపోతగా వాన కురుస్తున్నా సర్వే జరుగుతున్న తావులకు ఉరుకులు, పరుగులు పెట్టారు. తాము పింఛన్లకు అర్హులమన్న రుజువులు చూపించేందుకు ఎగబడ్డారు.
 
గుండెలు గుబగుబలాడుతుండగా..
ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల సర్వే శుక్రవారం జిల్లాలో ప్రారంభమైనా కొన్నిచోట్ల అపశ్రుతులు ఎదురవడంతో వాయిదా పడింది. అనర్హుల పేరిట పింఛన్‌దారుల  సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ లబ్ధిదారుల గుండెల్లో ముందే గుబులు రేపగా.. ఓ ప్రామాణికత లేకుండా సాగిన సర్వే వారిని ఏమవుతుందోనన్న దిగులులోకి నెట్టింది. తొలిరోజు జిల్లాలో సుమారు 25 శాతం మాత్రమే సర్వే జరిగిందని అంచనా. రాజమండ్రి, కాకినాడ నగర పాలక సంస్థలతో పాటు పలు మున్సిపాలిటీల్లో సాయంత్రం మూడు గంటల వరకూ పింఛనుదారుల డేటా కంప్యూటర్లలోకి ఆన్‌లైన్ ద్వారా చేరలేదు.

సర్వే కేంద్రాల వద్ద ఉదయం నుంచి లబ్ధిదారులు బారులు తీరి, కూడూనీళ్లూ లేకుండా పడిగాపులు పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సాంకేతిక సిబ్బంది చేతులెత్తేయడంతో తొలిరోజు చేయాల్సిన సర్వేను 21కి వాయిదా వేశారు. మామిడికుదురు తదితర మండలాల్లో కూడా డేటా రాక జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పింఛ న్ల అర్హత పత్రాలను తీసుకుని సర్వే కేంద్రాలకు రావాలనడంతో వాటి నకళ్ల కోసం ఉదయం నుంచి జిరాక్సు సెంటర్ల వద్ద పింఛనుదారులు క్యూలు కట్టారు. మండపేట, జగ్గంపేట, పెద్దాపురం, రాజానగరం మండలాల్లోని పలుచోట్ల వర్షంలోనూ పింఛన్‌దారులు బారులు తీరారు.
 
వేర్వేరు జాబితాలు ఎగనామానికేనా..?
పరిశీలనలో క్రమపద్ధతి లోపించడంతో ఆ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. మండపేటలోని కొన్ని వార్డుల్లో పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద సర్వే నిర్వహించారు. ధృవీకరణ పత్రాలను అందజేసిన వారి పేర్లను ఓ జాబితాలో, అవి లేని వారి పేర్లను మరో జాబితాలో నమోదు చేశారు. దీంతో పత్రాలు ఇవ్వని పింఛన్‌దారులు ఏమవుతుందోనని కలత చెందుతున్నారు. సర్వే తీరును బట్టి కూడా పింఛన్లకు పెద్ద సంఖ్యలో ఎగనామం పెట్టే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వితంతు పింఛన్ల లబ్ధిదారులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

రేషన్, ఆధార్ కార్డులున్నా భర్త మరణ ధృవీకరణ పత్రం అడగడంతో చాలామంది వితంతువులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంటున్నారు. తన భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడని, ఇప్పటికిప్పుడు ధృవీకరణ పత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలని ఓ మహిళ వాపోయింది. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి రేషన్, ఆధార్ కార్డుల్లో దేనిలో వయసు ఎక్కువగా ఉంటే దానినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రెండింటిలో వయసు తక్కువగా ఉన్న వృద్ధులు తమ పింఛన్లకు ఎసరు పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 శాతం వరకూ రేషన్ కార్డులకు, ఆధార్ కార్డులకు పొంతన లేకుండా వయసు నమోదు జరిగింది.
 
సర్వేకు దూరంగా టీడీపీ ప్రజాప్రతినిధులు
అనర్హత సాకుతో పింఛన్లలో భారీగా కోత పెట్టడమే సర్వే లక్ష్యమన్న ఉద్దేశంతో.. ఆ నింద తమపై పడకుండా పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు సర్వేకు దూరంగా ఉన్నారు. కాగా కమిటీల్లో సామాజిక కార్యకర్తలను తొలగించి అన్ని చోట్లా టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించారు. నియోజక వర్గాల ఎమ్మెల్యేలు నేరుగా పిలిచి ఆదేశాలిస్తుండడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పింఛన్‌దారులకు న్యాయం చేయాలంటే వారి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయాలంటే సర్వే మరో మూడు రోజులైనా కొనసాగించాల్సిన అవసరం ఉందని అధికారులే అంటున్నారు.  కానీ సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట్ల తప్ప ఇతర ప్రాంతాల్లో శనివారంతోనే సర్వే ముగించేయనుండడంతో ఈ హడావుడి వల్ల అర్హులు కూడా పింఛన్లు కోల్పోతామని భయపడుతున్నారు.

మరిన్ని వార్తలు