అన్నదాతకు వెన్నుదన్ను

19 Sep, 2019 08:49 IST|Sakshi

అక్టోబర్‌ 15నుంచి రైతు భరోసా పథకం అమలు

జిల్లాలో ప్రారంభమైన సర్వే

ఈ నెల 25లోగా తుది జాబితా విడుదల 

కిసాన్‌ పథకం సన్న, చిన్నకారు రైతులకు కేంద్ర సాయం రూ.6,500

పెద్ద, కౌలు రైతులకు పూర్తిసాయం భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం  

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామనే భరోసా కల్పిం చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించడం లక్ష్యంగా ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అమలుకి రంగం సిద్ధమవుతోంది. లబ్ధిదారుల గుర్తింపు కోసం బుధవారం నుంచి సర్వే ప్రారంభించారు. కేవలం భూమి ఉన్న రైతులు మాత్రమే వర్తిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం (పీఎంకేఎస్‌ఎన్‌ఎస్‌) లోని రైతుల వివరాలను పరిశీలించిడంతో పాటు పెద్ద కౌలు రైతులు గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25న అర్హులు జాబితాను ప్రకటించనున్నారు. కిసాన్‌ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు కేంద్రం మూడు విడతలుగా మొత్తం రూ.6వేలు సాయం ఇస్తుండగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 సాయం అందించనుంది. పెద్ద కౌలు రైతులకు రూ.12500 పూర్తి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది.

అక్టోబర్‌ 15వ తేదీ నుంచి ఒకే విడతగా పెట్టుబడి సా యం రైతులందరికీ అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్‌ పథకం సాయం కేవలం భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే అందుతోంది. ఏటా మూడు విడతల్లో రూ.6వేలు మొత్తాన్ని కేంద్రం జమ చేస్తోంది. కాగా ప్రతి రైతు కుటుంబానికి రూ.12500 చొప్పున ముందుగానే పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలుకి చర్యలకు చేపట్టారు. అక్టోబర్‌ 15 నుంచి అమలుకానున్న అమలుకా నున్న ‘వైఎస్సార్‌ రైతుభరోసా’  పథకం కోసం లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు అందించనున్న రూ. 6వేలుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 జమచేసి మొత్తం రూ.12500 చెల్లించనుంది. కౌలు,  పెద్ద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రూ. 12500 చొప్పున ఒకే విడతలో అందజేయనుంది.  రైతు భరోసాకు కౌలు రైతులు అర్హులే గ్రామ వలంటీర్ల ద్వారా కౌలు రైతుల గుర్తింపునకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక సర్వేలో భాగంగా సొంత వ్యవసాయ భూమిలేని సాగుదారులను వలం టీర్ల గుర్తిస్తారు. కౌలుదారులకు చెందిన ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించి నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేసి వ్యవసాయ రెవెన్యూ అధికారులకు అందజేస్తారు. పరిశీలన అనంతరం లబ్ధిదారుల జాబితాలను అధికారులు, గ్రామ సభల్లో ప్రకటించి ఏమైనా మార్పులు, చేర్పులుంటే చేస్తారు.

ఈ జాబితాలో మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులు, డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ, ఏడీఏలు, పరిశీలిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది జాబితాను ఖరారు చేసి ఈ నెల 25న ప్రకటించనున్నారు.    జిల్లాలో సాగు విస్తీర్ణం 2.55 లక్షల హెక్టార్లు కాగా అందులో సుమారు 5లక్షల మందికి పైగా రైతులున్నారు. వీరితో పాటు కౌలు రైతులు లక్ష మంది వరకు ఉంటారు. ఈ ఏడాది వరి సాగు 2.13లక్షల హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా 36వేల హెక్టార్ల అపరాలు, మొక్కజొన్న, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. మిగిలిన భూమిలో 6వేల హెక్టార్లలో కూరగాయల పంట సాగు చేస్తున్నారు. దీనిలో 3,11,590 లక్షల మంది రైతులు పీఎం కిసాన్‌ పథకం కింద లబ్ధిదారులను గుర్తించారు. పక్కాగా అనర్హులు ఏరివేతకు బుధవారం ఈ నెల 25వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు.

పీఎం కిసాన్‌ జాబితాలో అధిక సం ఖ్యలో అనర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రైతుల అందరికీ తెలిసే విధంగా పంచాయతీ కార్యాలయాల్లో వద్ద ప్రదర్శించనున్నారు. 2019 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు వెబ్‌ల్యాండ్‌లో జరిగిన మార్పులు, చేర్పులు, మ్యుటేషన్‌లలో గుర్తించిన రైతులు జాబితా ఆధారంగా గ్రామస్థాయిలో, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు జాబితాలో స్పష్టమైన కారాణాలు పేర్కొంటూ జాబితా నుంచి తొలగిస్తారు. వెబ్‌ల్యాండ్‌లో ఇటీవల జరిగిన మార్పులు చేర్పులు వలన గుర్తించిన అనర్హత కలిగిన రైతులు ఇప్పటివరకు ఏ జాబితాలో నమోదు కానిరూతులు ఉంటే జాబితాలో చేరుస్తారు.

 రైతు భరోసాకు ఉండాల్సిన అర్హతలివే..
-ప్రధాన మంత్రి సమ్మాన్‌ నిధి కింద లబ్ధి పొందిన రైతులు కూడా వైఎస్సార్‌ రైతు భరోసాకు అర్హులే. 
-సొంతంగా భూమి ఉంటే 10సెంట్లు నుంచి 5ఎకరాలు ఉన్న ప్రతి రైతుకి ఈ పథకం వర్తిస్తుంది.  
-భూ యజమాని మరణిస్తే వారి వారసులు, భార్య ఉంటే వారి పేరున ఉన్న భూములు వివరాలను వెబ్‌ల్యాండ్‌లో మార్చుకోవాలి. ఒకే రేషన్‌కార్డులో గల కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. వ్యవసాయ ఉద్యానవన, పట్టు పరిశ్రమ నడిపే రైతులు, భూమిలేక కౌలుదారుగా సాగుచేస్తున్న రైతులు అర్హులే.
-తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో మాత్రమే కౌలుకి చేసినట్లు అవుతుంది. 
-కౌలురైతుకి 50 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ సాగు చేస్తూ అతని పేరున భూమి లేకుంటే ఈ పథకం వర్తిస్తుంది. 
-భూ యజమాని అంగీకారంతో కౌలు రైతులకి ఈ పథకం వర్తిస్తుంది.
-భూయజమాని తన భూమిని ముగ్గురు లేదా నలుగురికి కౌలుకిస్తే భూ యజమానితో పాటు ఆ కౌలు రైతుల్లో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. 
-డీ పట్టా భూముల్లో సాగు చేస్తున్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది.
-ఆన్‌లైన్‌లో భూమి నమోదు కాని రైతుకి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
-ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్న రైతులకి వర్తిస్తుంది. 
-స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుమస్తాలు, క్లాస్‌–4 సిబ్బంది, గ్రూప్‌ డి ఉన్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. 
-ఆధార్‌ నంబర్లు రిజిస్టర్‌ కాకుంటే వెంటనే నమోదు చేసుకోవాలి. 

అర్హులకు పథకం అందజేస్తాం.. 
వైఎస్సార్‌ రైతు భరోసాలో జిల్లాలో రైతులంతా వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. బుధవారం నుంచి గ్రామగ్రామాన రైతులకి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మూడు రకాల జాబితాల్లో ఉండే వివరాలు పరిశీలిస్తారు. అర్హులందరికి పధకం వర్తించేందుకు కృషి చేస్తున్నాం. రైతులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నాం. దీన్ని వినియోగించుకుంటే రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో ఎంతోమంది రైతులకు ఊరటనిస్తుంది. ఈ నెల 25వరకు సర్వే చేయనున్నాం. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– బి.జి.వి ప్రసాద్, వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్, శ్రీకాకుళం  

మరిన్ని వార్తలు