అతుకుల బండి.. ఆదిత్యునికండి!

31 Oct, 2017 08:37 IST|Sakshi
వెల్డింగ్‌ పనులు చేస్తున్న దృశ్యం , పుష్కరిణిలో సిద్ధం చేసిన హంస నావవ

అతుకులతో సిద్ధమైన హంస వాహనం

మంత్రి పరిటాల ఆదేశాలతో ‘అనంత’ వెళ్లిన వాహనం

తర్వాత మాయమైన  తెప్ప సామగ్రి

వెల్డింగులతో నెట్టుకురానున్న ప్రస్తుత హంస వాహనం

గతంలో ఓ ఉద్యోగి నిర్వాకంపైనా అనుమానాలు 

అరసవల్లి: విఖ్యాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. హంస నావికా ఉత్సవానికి ఇంకా ఒక్క రోజే ఉంది. పవిత్ర ఇంద్రపుష్కరిణిలో ముగ్గురు దేవేరులతో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చేందుకు స్వామి సతులతో సిద్ధంగానే ఉన్నారు. అయితే ఆయన విహరించే వాహనమే ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ ఉత్సవానికి అన్ని ఏర్పా ట్లు పకడ్బందీగా చేసేందుకు ఆలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వారిలో కూడా బయటకు చెప్పలేని ఆవేదన కనిపిస్తోంది.

గత ఏడాది తెప్పోత్సవంలో కనిపించిన నావకు ఇప్పటి నావకు అసలు పోలిక లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాహన ఫ్రేమింగ్‌లో ఎక్కడచూసినా ఏదో ఒక లోపం కనిపిస్తోంది. వెల్డింగ్‌లు చేసీ చేసీ ఎలాగోలా హంస వాహనాన్ని సోమవారం సాయంత్రానికి సిద్ధం చేశారు.

పదేళ్ల కిందట నగరానికి చెందిన పేర్ల ప్రభాకరరావు అనే దాత ఇచ్చిన ఈ హంస వాహనానికి ప్రత్యేక బోల్ట్‌ ఫిటింగ్‌ సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు లేవు. బోల్టులు లేకపోవడం, కొన్ని ఫ్రేములు కన్పించకపోవడంతో చాలా చోట్ల వెల్డింగ్‌ అతుకులు తప్పలేదు. దీంతో ఇప్పుడు వాహనం రూపురేఖలే మారిపోయాయి. గత ఏడాది ఈ వాహనాన్ని అనంతపురం పంపించడంతోనే ఈ దుస్థితి నెలకొందని అధికారులంటున్నారు.

జిల్లాలో ఇన్‌చార్జి మంత్రిగా పనిచేసిన కాలంలో మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కుంతిమట్టి (వెంకటాపురం)లో కృష్ణ, రాయలసీమ నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా అక్కడి అనం త పద్మనాభ స్వామి దేవాలయ తెప్పోత్సవానికి ఆదిత్యుని హంస వాహనాన్ని గత ఏడాది డిసెంబర్‌ 12న తరలించారు. మంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు ఆలయ ఈ వాహనాన్ని ‘అనంత’కు తరలించారు. అయితే నాడు వాహనాన్ని తీసుకెళ్లిన తర్వాత అదే నెలలో 15 వతేదిన తిరిగి వాహనం అరసవల్లికి చేరుకుంది. అయితే అనంతపురం తెప్పోత్సవంలో వీలు కోసం ఆదిత్యుని హంస వాహనాన్ని ఇష్టానుసారంగా మార్చేసి, ఫ్రేమింగ్‌ మార్చేయడంతో ఇప్పుడు ఆదిత్యుని వాహనం తీరు మారిపోయింది. ఎక్కడికక్కడ బోల్టుల సిస్టమ్‌ పాడైపోయింది. దీంతో చేసేదేమీ లేక వెల్డింగ్‌లతో లోపాలను కప్పేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

వాహన తరలింపు అధికారికంగానే జరిగిందని ఆలయ అధికారులు చెబుతుంటే హంస వాహనాన్ని దేవాదాయ శాఖ ఆర్జేసి ఉత్తర్వుల మేరకు సవ్యంగా తీసుకెళ్లి, అలాగే తిరిగి తెచ్చామని, ఇందుకుగాను విరాళంగా రూ.11,001 లను అరసవల్లి దేవాలయానికి చెల్లించామని అనంతపురం కార్యక్రమ వైదిక నిర్వాహకుడు నేతేటి భాస్కరరావు ‘సాక్షి’కి తెలిపారు.

గతంలోనే..
గతంలో ఇక్కడ విధుల్లో ఉన్న లక్ష్మణరావు అనే ఉద్యోగి నిర్వాకంతోనే హంస వాహనానికి చెందిన పలు సామగ్రి మాయమైందనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆలయంలో కొన్ని ఇనుప వస్తువులను దొంగతనంగా అమ్మకానికి తీసుకెళ్లాడన్న ఆరోపణలతో లక్ష్మణరావును ఆలయ ఈఓ శ్యామలాదేవి సస్పెండ్‌ చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. అయితే ఈ ఉద్యోగి నిర్వాకంతోనే వాహన గోడౌన్‌ నుంచి పలు వస్తువులు, సామగ్రి మా యమయ్యాయని, దీనికి తోడు వాహన తరలింపు తర్వాత ఫ్రేమింగ్‌ పాడైందని, పేర్లు చెప్పడం ఇష్టం లేని పలువురు ఆలయ ఉద్యోగులు తెలిపారు. వాహనం అతుకులతో నెట్టుకురావడంతో గతంలోలాగా ఎక్కువమందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం నాటి తెప్పోత్సవం విజయవంతంగా నిర్వహిస్తామని, తెప్ప వినియోగంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంబంధిత ఆలయ ఉద్యోగులు ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు