ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌పై వేటు?

24 Sep, 2017 02:24 IST|Sakshi

నేడో, రేపో ప్రకటన

మంత్రిని ఆశ్రయించిన నాయుడు!

 సీఐ శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం

విశాఖపట్నం: గంజాయి అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నాయుడుపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. విజయవాడలో గంజాయితో పట్టుబడ్డ నిందితులిచ్చిన సమాచారంతో కానిస్టేబుల్‌ నాయుడు పేరు బయటకొచ్చింది. ఈ వ్యవహారంపై ‘ఎక్సైజ్, స్మగ్లర్‌ భాయిభాయి.. ఎంచక్కా గంజాయ్‌’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు స్పందించారు. నాయుడుపై కేసు నమోదుకు సంబంధించి విజయవాడ పోలీసుల నుంచి ఎక్సైజ్‌ అధికారులకు అధికారిక సమాచారం ఇంకా అందలేదు. నేడో, రేపో సమాచారం రాగానే ఆయనపై చర్యలు (సస్పెన్షన్‌) తీసుకోనున్నారు. ఇదే విషయాన్ని శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు చెప్పారు.

ఈ వ్యవహారం వెలుగు చూడడంతో నాయుడు పరారీలో ఉన్నారు. ఈ గండం నుంచి తనను గట్టెక్కించాలని జిల్లాకు చెందిన ఓ మంత్రిని కానిస్టేబుల్‌ నాయుడు ఆశ్రయించినట్టు  తెలిసింది. మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో పాడేరు మొబైల్‌ టీమ్‌ సీఐ పెదకాపుపై కేసు నమోదయింది. దీంతో ఆయనను గతంలోనే సస్పెండ్‌ చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఎక్సైజ్‌ సోమవారం స్టాట్యుటరీ నోటీస్‌ జారీ చేయనున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు