త్వరలో సస్పెన్స్‌ కథా చిత్రం  

5 Jan, 2020 13:10 IST|Sakshi
సినీ దర్శకుడు వంశీని సత్కరిస్తున్న సాయిరామ్మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి

చుట్టూ జరిగిన సంఘటనలే కథా వస్తువులు 

కథా రచయిత, సినీ దర్శకుడు వంశీ 

నేడు ‘నల్లమిల్లోరిపాలెం’ పుస్తకావిష్కరణ 

రాయవరం: తన దర్శకత్వంలో త్వరలోనే సినిమా రూపుదిద్దుకోనున్నట్లు ప్రముఖ కథా రచయిత, సినీ దర్శకుడు వంశీ తెలిపారు. రాయవరం మండలం పసలపూడి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరిలో సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశముందన్నారు. ఫ్యామిలీలో జరిగే సస్పెన్స్‌ కథాంశంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందన్నారు. తన చుట్టూ జరిగిన సంఘటనలనే కథా వస్తువులుగా మలచుకుని ‘మా పసలపూడి కథలు’ రాశానన్నారు. అలాగే తాను చూసిన మనుషులను పాత్రలుగా మలిచానని, ఇటీవల సినిమా దర్శకత్వంలో విరామం వచ్చిన విషయం వాస్తవం అన్నారు. తొలిసినిమా మంచు పల్లకితో ప్రారంభించగా.. ఇప్పటి వరకు 26 సినిమాలకు దర్శకత్వం వహించానని, వేమూరి సత్యనారాయణ ప్రోత్సాహంతో 22వ ఏటనే సినిమా దర్శకుడిగా మారినట్టు తెలిపారు. అంతకు ముందు దర్శకుడు వి.మధుసూదనరావు వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మల్లెపూవు, జడ్జిగారి కోడలు, రాజారమేష్‌ సినిమాలకు పనిచేశానని అన్నారు.  

ఉల్లాసంగా గడిపిన వంశీ
దర్శకుడు వంశీ పసలపూడిలో చిన్ననాటి మిత్రులతో కొద్దిసేపు గడిపారు. ఆయన చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాలను సందర్శించి, వైఎస్సార్‌ పార్కు వద్ద మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను మిత్రులు, వంశీతో నెమరు వేసుకున్నారు. వైఎస్సార్‌ పార్కులో ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పోతంశెట్టి సాయిరామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వంశీని మిత్రులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ప్రగతి రామారెడ్డి, వైఎస్సార్‌ సీపీ నేతలు చింతా సుబ్బారెడ్డి, కర్రి సుముద్రారెడ్డి, బొడబళ్ల అప్పలస్వామి, బాలు, కర్రి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, కొవ్వూరి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
నేడు నల్లమిల్లోరిపాలెం పుస్తకావిష్కరణ 
వంశీ ‘నల్లమిల్లోరిపాలెం’ కథలు పుస్తకావిష్కరణ ఆదివారం కాకినాడలో జరుగుతున్నట్లు మాజీ ఎంపీపీ, వంశీ మిత్రుడు పోతంశెట్టి సాయిరామ్మోహన్‌రెడ్డి తెలిపారు. కాకినాడ ఆదిత్య అకాడమీలో సాయంత్రం ఐదు గంటలకు పద్మాలయా గ్రూపు సంస్థ అధినేత నల్లమిల్లి బుచ్చిరెడ్డి అధ్యక్షతన పుస్తకావిష్కరణ చేపడుతున్నట్లు తెలిపారు. పుస్తకాన్ని ఆదిత్య సంస్థల చైర్మన్‌ నల్లమిల్లి శేషారెడ్డికి అంకితమిస్తున్నట్లు వంశీ తెలిపారు.    

మరిన్ని వార్తలు