అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

20 Jul, 2014 03:09 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

- కట్టుకున్న వాడే కడతేర్చాడంటున్న బాధితులు
 నెల్లూరు (క్రైమ్) : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మూలాపేట పాత పోలీసు క్వార్టర్స్ సమీపంలో ఓ ఇంట్లో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి, సోదరి, స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని ప్రగతినగర్‌కు చెందిన ఎస్‌కే మాబున్నీ, ఖాలేషా దంపతుల పెద్ద కుమార్తె ఫామిదా (20)కు మూలాపేట పోలీస్‌క్వార్టర్స్ సమీపంలో నివసిస్తున్న ఫాతిమా, ఇమాముల్లా కుమారుడు మౌలాలితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి 16 నెలల  కుమారుడు ఆసీఫ్ ఉన్నాడు. మౌలాలి గూడూరులో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు.
 
 మద్యానికి బానిసైన మౌలాలి భార్యను నిత్యం వేధించేవాడు. అత్తమామలు కూడా వేధించ సాగారు.   పలు దఫాలు వారి మధ్య తీవ్ర స్థాయిలో ఘ ర్షణలు జరిగాయి. అత్తింటి వేధింపులపై ఆమె తన తల్లిదండ్రులకు తెలిపి విలపిం చేది.  సర్దుకోమని సూచించడంతో వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది. 15 రోజు లుగా మౌలాలి పనులకు వెళ్లడం మానివేశాడు. శనివారం ఉదయం మాబున్నీ చిన్న కుమార్తె షాహిదా తన సోదరి ఫామిదాను ఫోన్‌లో పరామర్శించింది. అయితే సమాధానం చెప్పకుండా రోదిస్తూ ఫోన్ పెట్టేసింది. అదే సమయంలో దంపతుల నడుమ వాగ్వివాదం చోటు చేసుకుంది. ఫామిదా పడక గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన భర్త తలుపులు పగులగొట్టి ఆమెను కిందకు దించాడు. 108కు సమాచార ం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ఫామిదా అప్పటికే మృతి చెందినట్లు చెప్పి వెళ్లిపోయారు. దీంతో మౌలాలి మృతురాలి సోదరి షాహిదాకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలిపాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఫామిదాను అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. తాను ఫోన్ చేసినప్పుడు ఫామిదా రోదిస్తూ ఉం దని మృతురాలి సోదరి  వాపోయింది.
 
 కొద్దిసేపటికే మౌలాలి తమకు ఫోన్ చేసి ఫామి దా మృతి చెందిందని చెప్పడం బట్టి చూస్తే  ఆమె భర్త, అత్తింటివారే హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించారు. చిన్నారి ఆసీఫ్‌ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. రంజాన్‌కు బట్టలు కొనివ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని భర్త మౌలాలి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాల్గో నగర పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు