వివాహిత అనుమానాస్పద మృతి

21 Apr, 2015 04:34 IST|Sakshi

 సగంచెర్వు (పాలకొల్లు అర్బన్) : అనుమానాస్పద స్థితిలో ఒక వివాహిత మృతిచెందింది. స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం తూర్పుతాళ్లుకి చెందిన దొంగ అనంతలక్ష్మి (26)కి పాలకొల్లు మండలం సగంచెర్వుకి చెందిన గుడాల లలిత్‌రాజుతో 2008లో వివాహమయింది. లలిత్‌రాజు గోపాలమిత్రగా చిట్టవరంలో పనిచేస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు సాయిశ్రీ అగ్గిరాజు వున్నారు. అయితే వివాహం అయిన దగ్గర నుంచి లలిత్‌రాజు తల్లి, అతని మేనమామలు తరచూ అనంతలక్ష్మిని వేధించేవారు. దీంతోపాటు ఆమెను పలుమార్లు హింసించడంతో అనంతలక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
 
  తన భర్త వేధిస్తున్నాడని మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. అయితే పెద్దమనుషుల జోక్యంతో ఆమె మళ్లీ కాపురానికి వచ్చింది. వేన్నీళ్లకు చన్నీళ్లు సాయంగా అనంతలక్ష్మి టైలరింగ్ చేసి భర్తకు చేదోడువాదోడుగా నిలిచేది. ఉమ్మడి కుటుంబంలో ఉంటే తన కుమార్తెను వేధిస్తున్నారనే కారణంతో అనంతలక్ష్మి తల్లిదండ్రులు మార్రాజు-జయలక్ష్మి రూ.లక్షతో సగంచెర్వులో చిన్న ఇల్లు కొని దాంట్లో అల్లుడు, కూతురు కాపురం వుండేలా ఏర్పాట్లు చేశారు. కేవలం మూడు నెలలు తిరగకుండానే అనంతలక్ష్మి ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె గొంతు నులిమి చీరతో ఉరివేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె కాళ్లు భూమికి తగిలే విధంగా వేలాడి ఉండడంతో ఈ అనుమానానికి బలం చేకూరుతోంది.
 
 అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
 మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై కె.మోహనవంశీ తెలిపారు. దుర్ఘటనా స్థలాన్ని డీఎస్పీ పి.సౌమ్యలత, పాలకొల్లు రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు