ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్

30 Sep, 2014 03:48 IST|Sakshi
ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
రేపటి నుంచి మూడేళ్లపాటు పదవిలో ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో
4 దశాబ్దాలు సేవలందించిన ప్రసాద్

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మొదటి విజిలెన్స్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బుధవారం నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎస్వీ ప్రసాద్ గత నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక హోదాల్లో పనిచేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రసాద్ ఆ తర్వాత అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చదివారు.
 
 1975లో అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. మొదట గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆయన ప్రతిభా పాటవాలను చూసి నలుగురు ముఖ్యమంత్రులు వారి పేషీల్లో వివిధ హోదాల్లో నియమించుకున్నారు. ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.జనార్దన్‌రెడ్డి, చంద్రబాబుల పేషీల్లో కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌చైర్మన్‌తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు. 2010లో తుపాను వచ్చిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శింగా ప్రసాద్ చూపిన చొరవను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొనియాడారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు