బాహుబలి కట్టడాలు కాదు కనీసం కార్లస్టాండ్లు లేవు

6 Jan, 2020 07:44 IST|Sakshi
మాట్లాడుతున్న  సినీ నటుడు పృథ్వీరాజ్, పక్కన సింగరాజు వెంకట్రావు

అమరావతిలో కార్పొరేట్‌ ఉద్యమం నడుస్తోంది 

మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రమంతా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి 

ఒకే చోట లక్షకోట్లు ఖర్చుచేస్తే మిగితా ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి 

విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌వీబీసీ చైర్మన్‌ బి.పృథ్వీరాజ్‌ 

సాక్షి, ఒంగోలు: రాష్ట్రానికి 30 ఏళ్లపాటు జగన్‌మోహన్‌రెడ్డే సీఎంగా ఉంటారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌వీబీసీ చైర్మన్‌ బి.పృథ్వీరాజ్‌  అన్నారు. ఆదివారం ఒంగోలులో ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిస్థితులను కళ్లారా చూస్తే అక్కడ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో అర్థం అవుతుందన్నారు. సీఎం కాన్వాయ్‌ వెళుతుంటే దారి పొడవునా ఉండే పోలీసులకు కనీసం అత్యవసరం అయితే టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సౌకర్యాలు లేవన్నారు. బాహుబలి కట్టడాలంటూ సింగపూర్‌ను తలపిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు కనీసం కార్లు పెట్టుకునేందుకు స్టాండ్లు సైతం లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

చదవండి: పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని

రేకుల షెడ్లు నిర్మించి ఇంధ్రభవనాలను కట్టినట్లు ధర్నాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటివరకు కనీసం ఎలాంటి రాజకీయ సభలలోను పాల్గొనని భువనేశ్వరిని సైతం తీసుకువచ్చి ధర్నా చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసినట్లుగా పేర్కొనడం చూస్తుంటే రెండు గాజుల కథను తలపిస్తుందన్నారు. తాను తిరుపతి అలిపిరివద్ద రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి వచ్చే రైతులను పలకరిస్తే వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూమి పులకించిందని, మళ్లీ నేడు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు అండ్‌కోకు మాత్రం ఉక్రోషం, కడుపుమంట పెరిగిపోతున్నాయన్నారు. వేలాది ఎకరాలను ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేసి పేద రైతులను నిలువునా దగా చేసి నేడు రైతుల కోసం అంటూ ఉద్యమించడం దారుణం అన్నారు.

అమరావతిలో ధర్నా చేస్తున్న వారిని చూస్తే ఆడి కార్లలో, ఖద్దరు దుస్తులు ధరించి చేతులకు బంగారు గాజులు ధరించి వస్తుంటే కార్పొరేట్‌ మాయాజాలం కాక, నిజమైన రైతులు చేస్తున్న ఉద్యమమేనా అని ప్రశ్నించారు. నిజంగా అమరావతి రాజధాని కావాలంటే దేశానికి రెండో రాజధాని కోసం కేంద్రం ఎదురుచూస్తుందని, అందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్నారు.  ఇందుకు అవసరమైతే తాను ఢిల్లీ వరకు పాదయాత్ర చేసేందుకు సైతం సిద్ధమన్నారు. కేవలం సామాజికవర్గ సామ్రాజ్యస్థాపన కోసం భూములు కొన్నారని, దేశ రెండో రాజధానికి సిద్ధపడితే బినామీల భూములకు నష్టం వాటిల్లుతుందనే భయమే వెనుకడుగుకు కారణం అంటూ విమర్శించారు. చెడు ప్రక్షాళన చేయడమే   వైఎస్సార్‌ సీపీ లక్ష్యమన్నారు. 

గత ఐదేళ్లలో జనసేన ఎందుకు ప్రశ్నించలేదు? 
రైతుల మీద అంత ప్రేమే ఉంటే గత ఐదేళ్లలో రైతులను ఎందుకు పట్టించుకోలేదని జనసేన ఎందుకు ప్రశ్నించలేదని పృథ్వీ ప్రశ్నించారు. రైతులంటే అంత ప్రేమ ఉంటే కరకట్టమీద నివాసం ఉంటూ రోడ్లకోసం పచ్చనిపొలాలను నాశనం చేస్తున్నారంటూ రైతులు గగ్గోలు పెట్టినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. గగ్గోలు పెట్టడం తెలుగుదేశం, జనసేన నైజంగా మారిందని, మసిపూసి మారేడు కాయ చేయడం చంద్రబాబు సహజలక్షణం అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు అని, అంతే తప్ప లక్షకోట్లు ఒకేచోట పెడితే మిగితా ప్రాంతాల అభివృద్ధి మాటేంటన్నారు. లక్షకోట్లు ఖర్చుపెట్టాలనడమే తప్ప ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా ఎందుకు చేశారో ప్రజలు నిలదీయాలన్నారు.

ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తారని, అంతే కాకుండా నాలుగైదు రోజుల్లో ప్రతి జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలు కూడా వెల్లడిచేస్తారన్నారు. ప్రకాశం ప్రగతి పథంలోకి తీసుకువెళ్లడానికి తీసుకుంటున్న చర్యలు కూడా ప్రకటిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్‌తోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని, ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, గోవర్ధన్‌రెడ్డి, దాట్ల యశ్వంత్‌వర్మ, తోటపల్లి సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు