ఎస్వీయూ అరుదైన ఘనత

10 Jun, 2017 11:19 IST|Sakshi
ఎస్వీయూ అరుదైన ఘనత

► నాక్‌లో ఏప్లస్‌ గ్రేడ్‌
► తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వర్సిటీ


యూనివర్సిటీ క్యాంపస్‌: ఎస్వీయూ 2009లో నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌)లో ఏ గ్రేడ్‌ సాధించింది. అప్పట్లో అదో రికార్డు. ఆ రికార్డును ప్రస్తుతం తిరగరాసింది. ఏప్లస్‌ గ్రేడ్‌ సాధించింది. బెంగళూరులోని నాక్‌ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన నాక్‌ గ్రేడింగ్‌ ఫలితాల్లో ఎస్వీయూ 3.52 గ్రేడ్‌ పాయింట్లతో ఏ ప్లస్‌ గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు గ్రేడ్‌ పాయింట్లకుగాను 3.52 గ్రేడ్‌ పాయింట్లు సాధించడం విశేషం.

దేశంలో ఇప్పటి వరకు 7 యూనివర్సిటీలకే నాక్‌లో ఏప్లస్‌ గ్రేడ్‌ ఉంది. తాజాగా ఎస్వీయూ ఏప్లస్‌ సాధించి 8వ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. దేశంలోని ఏప్లస్‌ గ్రేడ్‌ ఉన్న యూనివర్సిటీల్లో నాలుగు డీమ్డ్, ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ యూనివర్సిటీకి కూడా ఏప్లస్‌ లేదు. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం)కి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా (హైదరాబాద్‌), ఆంధ్రా (విశాఖపట్నం)లకు సాధ్యం కాని ఏప్లస్‌ గ్రేడ్‌ను ఎస్వీయూ సొంతం చేసుకోవడం విశేషం.

దక్షిణాది రాష్ట్రాల్లో అలగప్పా యూనివర్సిటీ తర్వాత ఏప్లస్‌ సాధించిన రెండో యూనివర్సిటీ ఎస్వీ యూ కావడం విశేషం. గత ఏడాది టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 601–800 ర్యాంక్‌ పొందింది. ఈ ఏడాది ప్రకటించిన ఏషియన్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 401–600 ర్యాంక్‌ పొందింది. బ్రిక్స్‌ ర్యాంకింగ్స్‌లో సౌత్‌ ఇండియాలో మొదటి ర్యాంక్‌ పొందింది. నాక్‌లో మంచి గ్రేడ్‌ రావడం పట్ల క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు