అభద్రతా భావంలో చదువులు

28 Apr, 2016 04:46 IST|Sakshi
అభద్రతా భావంలో చదువులు

ఎస్వీయూలో పెరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలు
ఆందోళన చెందుతున్న విద్యార్థినులు
 

యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థినుల చదువులు అభద్రతా భావంలో సాగుతున్నాయి. ప్రొఫెసర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వారు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పరిశోధనలు చేస్తున్న మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎస్వీయూలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలా కాలం నుంచి వస్తున్నాయి. 2011లో జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రాజేశ్వరరావు జైలు పాలయ్యారు. రసాయనశాస్త్ర విభాగంలో ఓ ప్రొఫెసర్‌పై గత ఏడాది డిసెంబర్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.

ఇంగ్లిషు విభాగంలో ఓ ప్రొఫెసర్‌పై అదే విభాగానికి చెందిన ఒక పోస్టు డాక్టర్ ఫెలో ఫిర్యాదు చేశారు. సివిల్ ఇంజినీర్ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్‌పై అదే విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని ఫిర్యాదు చేశారు. సాంఖ్యక శాస్త్ర విభాగానికి చెందిన మరో ప్రొఫెసర్‌పై  పీజీ విద్యార్థిని సుజాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్యాష్ కమిటీ తన నివేదికను సమర్పించింది. అందులో ఏమి పేర్కొంది ఇంతవరకు బహిర్గతం కాలేదు.

తాజాగా తెలుగు అధ్యయన శాఖకు చెందిన కె.మునిరత్నం తన వద్ద ఉన్న పరిశోధక విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఉమెన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రజని ఎస్వీయూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్వీయూ అధికారుల ఆదేశాల మేరకు క్యాష్ కమిటీ ఈనెల 23న విచారణ జరిపింది. విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయన్న అంశాన్ని బహిర్గతం చేయడం లేదు. విద్యార్థినులకు వసతి కల్పించాల్సిన అధికారులే వారిపట్ల నిర్దయగా వ్యవహరించడంతో వారిలో అభద్రత నెలకొంది. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాల్సి ఉంది.
 
 ప్రిన్సిపల్‌ను కొనసాగిస్తారా?
 ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ మునిరత్నం పనిచేస్తున్నారు. ఈయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈయన ప్రిన్సిపాల్‌గా కొనసాగడం వల్ల సాక్షులపై ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సాంఖ్యక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ రాజశేఖరరెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు దక్కాల్సిన ప్రిన్సిపాల్ పదవిని ఇవ్వలేదు. ఇదే సందర్భంలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మునిరత్నంను మాత్రం పదవిలో కొనసాగించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు