ముక్కుపు‘ఠా’లు

20 Feb, 2016 23:36 IST|Sakshi

 పల్లెకు పోదాం..సందడి చేద్దాం.. చలో..చలో.. కాలుష్యం లేని పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కల్మషం లేని మనసులతో ఆత్మీయ పలకరింపులు, ఎవరికి ఏ అవసరమొచ్చినా పదిమందీ గుమిగూడడం..కొత్తవారితో అమాయకంగా మాటలు..ఒకరికొకరు సహాయం చేసుకోవడం..పండగొచ్చిందంటే అంతా కలిసి జరుపుకోవడం..అందరి మదిలో మెదిలే అద్భుత భావన ఇది. ఈ వాతావరణాన్ని పల్లెల్లో ఆస్వాదించడానికి వెళ్లేవారు  ఇప్పుడు ముక్కుమూసుకుని అక్కడ అడుగు పెట్టాల్సిందే.  చాలామంది ఇళ్లలో మరుగుదొడ్లు లేని కారణంగా గ్రామాల్లో రోడ్ల వెంబడి.. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ బడితే అక్కడ బహిరంగ మలమూత్ర విసర్జన జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు  వెగటు పుట్టిస్తోంది.
 
 శృంగవరపుకోట రూరల్: దేశ ప్రధాని ‘స్వచ్ఛభారత్’ పిలుపులో భాగంగా ఈ ఏడాది అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.  ప్రభుత్వం చేయించిన సర్వే
 మేరకు జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు 3,01,458 ఉన్నాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు   కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నప్పటికీ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
 
 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి ఇలా..
 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రగతి జిల్లాలో  అథమంగానే ఉంది. జిల్లాలోని 34 మండలాల్లో 3,01,458 మరుగుదొడ్లు లేని ఇళ్లకు గాను 94,442 ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటివరకు 12,428 మరుగుదొడ్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  ఇంకా శృంగవరపుకోట మండలంలో 177, బాడంగి 282, బలిజిపేట 59, భోగాపురం 111, బొబ్బిలి 386, బొండపల్లి 216, చీపురుపల్లి 166, దత్తిరాజేరు 230, డెంకాడ 275, గజపతినగరం 32, గరివిడి 143, గుమ్మలక్ష్మీపురం 416, గుర్ల 140, జామి 12, జియ్యమ్మవలస 181, కొమరాడ 17, కొత్తవలస 224, కురుపాం 278. లక్కవరపుకోట 391, మక్కువ 147, మెంటాడ 92, మెరకముడిదాం 14, నెల్లిమర్ల 142, పాచిపెంట 888, పార్వతీపురం 622, పూసపాటిరేగ 206, రామభద్రపురం 210, సాలూరు 169, సీతానగరం 144, తెర్లాం 205, వేపాడ 326, విజయనగరం 191 మొత్తంగా 7685 మరుగుదొడ్ల నిర్మా ణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే నిర్మించిన మరుగుదొడ్లకు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లుగా నిధులు వెంటవెంటనే మంజూరు చేయకపోవడం కూడా ప్రగతికి అవరోధంగా నిలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 సామూహిక మరుగుదొడ్లే ప్రత్యామ్నాయం..
 ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం అంటే మహిళల ఆత్మ గౌరవానికి భంగపాటని అధికారులు గ్రామస్థాయిలో అవగాహన క ల్పిస్తూ  మరుగుదొడ్లకు నిధులు మంజూరు చేస్తామన్నా ఇళ్లల్లో స్థలాభావంతోనే  మరుగుదొడ్డి నిర్మాణానికి వెనుకడుగు వేసే పరిస్థితి  ఒక కారణంగా కనిపిస్తోంది. అది కాకుండా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల మంజూ రులో జాప్యం జరుగుతుండడం మరో కారణంగా కనిపిస్తోంది. అప్పులు చేసి మరుగుదొడ్డి నిర్మిస్తే బిల్లులందక పోతే అప్పులు తీర్చడమెలా అని శంకిస్తూ చాలామంది ముందుకు రావడం లేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ముందుగా పలు గ్రామాలను ఎంపిక చేసి సామూహిక మరుగుదొడ్లను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించి వాటికి పూర్తిస్థాయిలో నీరు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతిరోజూ పంచాయ తీ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చూస్తేనే ఆనుకున్న సత్ఫలితాలు వస్తాయని పలువురు భావిస్తున్నారు.    
 
 నిర్మాణ బాధ్యతలు ఉపాధి పథకానికి?
 స్వచ్ఛభారత్ పథకంలో అనుకున్నంతగా నిధులు లేనందున ఇక నుంచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలు ఉపాధిహామీ పథకానికి అప్పగించనున్నట్టు అధికారిక సమాచారం. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల ఉపాధి పథకం ఏపీఓలకు మరుగు దొడ్ల నిర్మాణాలకు సంబంధించి ఇటుకలు, బేసిన్లు ముందుగానే సిద్ధం చేసుకున్న అనంతరం శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు  ఉపాధి సిబ్బం దితో  జిల్లా ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు