స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ

6 Nov, 2014 05:26 IST|Sakshi
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ

* లొకేషన్ మార్చి అరకులోయలో షూటింగ్ చేస్తున్నా
* సినీనటుడు బాలకృష్ణ
అరకులోయ : హూదూద్ తుఫాన్ ప్రభావంతో ధ్వంసమైన ఆంధ్ర ఊటి అరకులోయలోని అభిమానులను కలవాలనే ఎస్‌ఎల్‌వి బ్యానర్‌పై తాను హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ లొకేషన్ మార్పు చేసి అరకులోయలోయకు వచ్చినట్టు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృ ష్ణ అన్నారు. మండలంలో కొండచరియలు విరిగిపడి తల్లిదుండ్రులు, పిల్లలను పోగొట్టుకొని నందివలస పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను బుధవారం పరామర్శించారు. ప్రభుత్వం సేవలపై ఆరాతీశారు. ఉచితంగా ఇస్తున్న నిత్యావసర వస్తువులు అందుతున్నదీ లేనిదీ  అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాన్‌తో జీవనోపాధి కోల్పొయిన వారిలో మనోధైర్యాన్ని నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఏజెన్సీలో పోడుసాగుతో పాటు కాఫీ, మిరియాలు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లు నేలమట్టమయ్యాయన్నారు. నందివలస పాఠశాలలో పిల్లలతో ముచ్చటించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన కాఫీ తోటలు పరిశీలించారు. బాలకృ ష్ణతో ఫొటోలు తీయించుకునేందుకు గిరిజన మహిళలు ఆసక్తి చూపారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, వైస్‌ఎంపీపీ పొద్దు అమ్మన్న, సర్పంచ్ కొర్రా సన్యాసి, ఎంపీటీసీ అభిమాన్ పాల్గొన్నారు.
 
యండపల్లివలసలో స్వచ్ఛభారత్
తెలుగుదేశం హయాంలో జన్మభూమి, క్లీన్,గ్రీన్ వంటి కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ యండపల్లివలసలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. అక్కడే పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రేస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారన్నారు. పద్మాపురం పంచాయతీ పరిధిలోని వృద్ధులకు పింఛన్‌లు పంపీణి చేశారు. బాలకృష్ణకు  మహిళలు హారతిచ్చి ఘనస్వాగతం పలికారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లు గజమాలతో ఆయనను సన్మానించారు.

మరిన్ని వార్తలు