తిరుమల పరిణామాలపై స్వామీజీల ఆందోళన

4 Jun, 2018 12:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ముప్పేట దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు జరిపిన స్వామిజీలు ఒక నిర్ణయానికి వచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి స్వామీజీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా స్వామీజీలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మీడియా, మీడియా ప్రతినిధులను కూడా దూరంగా ఉంచారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణనంద స్వామి, కమలానంద భారతి స్వామితో పాటు పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు