హైదరాబాద్‌కు బయలుదేరిన పరిపూర్ణానంద

4 Sep, 2018 11:03 IST|Sakshi
శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్‌ నగర బహిష్కరణను హైకోర్డు కొట్టివేయడంతో ఆయన నేడు నగరంలో అడుగుపెట్టనున్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన నగరానికి బయలుదేరారు. అంతకుముందు పటిష్ట భద్రత నడుమ పరిపూర్ణానందను పోలీసులు ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. స్వామిజీ వెంట తెలంగాణ ఎమ్మెల్యే ప్రభాకర్‌, బీజేపీ కార్యకర్తలు, భక్తులు తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనాంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘నన్ను బహిష్కరించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాపై తెలంగాణ పోలీసుల చర్యలను కోర్టు కొట్టివేసింది. ధర్మం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దం. తెలంగాణకు వెళ్లేలా ఆశీర్వదించమని అమ్మవారి కోరుకున్నా. అమ్మవారు కటాక్షించారు. అందుకే దర్శనం చేసుకోవాలని వచ్చా. నేను కేరళ వాసిని.. నా సొంత రాష్ట్రంలో వచ్చిన విపత్తును తగ్గించాలని అమ్మవారిని కోరుకున్నా, త్వరలోనే కేరళను సందర్వించబోతున్నా’ అంటూ పరిపూర్ణానంద వివరించారు. ఇక పరిపూర్ణానంద హైదరాబాద్‌ రానుండటంతో ఘనంగా స్వాగతం పలకాలని బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బైక్‌ ర్యాలీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.    

అసలేం జరిగిందంటే..
ఓ టీవీ చానెల్‌లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణపై పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. 

మరిన్ని వార్తలు