స్వర్ణపుష్పార్చన పథకానికి విశేష స్పందన

16 May, 2019 11:42 IST|Sakshi
స్వర్ణసంపెంగ పుష్పం

132 స్వర్ణపుష్పాల తయారీకి విరాళాలు అందించిన దాతలు

తొలివిడతలో 108 స్వర్ణపుష్పాల తయారీ

నృసింహ జయంతి రోజున కొత్త స్వర్ణపుష్పాలతో పూజ

సింహాచలం(పెందుర్తి): సింహాచలం దేవస్థానం ప్రవేశపెట్టిన ‘స్వర్ణపుష్పార్చన’ పథకానికి దాతల నుంచి విశేష స్పందన వచ్చింది. సంకల్పించిన రెండున్నర నెలల్లోనే కావాల్సిన 132 స్వర్ణపుష్పాలకు దాతలు విరాళాలు అందజేశారు. ఇప్పటికే 108 స్వర్ణపుష్పాలు సిద్ధం కావడంతో ఈనెల 17వ తేదీన నృసింహ జయంతిని పురస్కరించుకుని స్వామికి స్వర్ణపుష్పార్చన పూజ జరిపేందుకు అధికార, వైదిక వర్గాలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఒక భక్తుడు స్వామికి కానుకగా ఇచ్చిన 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో ఇప్పటివరకు ప్రతీ గురువారం, ఆదివారం స్వర్ణపుష్పార్చన నిర్వహిస్తున్నారు. ఆ పుష్పాలు కేవలం బంగారు కోటెడ్‌వి కావడంతో పక్కా స్వర్ణపుష్పాలను తయారు చేయించాలని దేవస్థానం అధికార, వైదిక వర్గాలు గత ఫిబ్రవరిలో సంకల్పించారు.

ఒక్కో స్వర్ణ పుష్పం 18 గ్రాముల బరువుతో ఉండి మొత్తం 132 స్వర్ణపుష్పాలను తయారు చేయించాలని భావించారు. ఈ మేరకు నగరంలోని వైభవ్‌ జ్యూయలర్స్‌ ద్వారా కోయంబత్తూరుకి చెందిన ఒక వ్యాపార సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో స్వర్ణ పుష్పానికి 64 వేలు ఖర్చుగా నిర్ణయించి దాతల నుంచి విరాళంగా తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. అలా దేవస్థానం సంకల్పానికి దాతల నుంచి విశేషంగా ఆదరణ లభించింది. మొత్తం 103 మంది దాతలు 132 స్వర్ణపుష్పాలకి విరాళాలను అందజేశారు. ఇప్పటికే 108 స్వర్ణపుష్పాలు తయారై ఉండటంతో వాటిని సింహగిరికి తీసుకురానున్నారు. ఈనెల 17వ తేదీన స్వర్ణపుష్పాలతో స్వామికి జరిగే తొలిపూజకు విరాళాలు ఇచ్చిన దాతలందరినీ ఆహ్వానించేందుకు అధికార, వైదిక వర్గాలు నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు