కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను..

8 Jun, 2014 09:08 IST|Sakshi
స్వరూపరాణి మెడలో హారం వేస్తున్న వీరబాబు

లెక్కించలేనన్ని వన్నెలను ప్రకృతిలో పొదిగిన విధి అతడికి ఒక్కగానొక్క వన్నె కూడా తెలియకుండా చేసింది. అయితేనేం.. ‘నీ జీవితాన్ని ఏడువన్నెల ఇంద్రధనువుగా మార్చడానికి నేనున్నాను. నీకు తెలియని రంగుల్ని నా స్పర్శగా, ప్రేమగా అనువదించి అందిస్తా’నంది ఓ యువతి. ‘చూపు లేని నీ బతుకునావకు చుక్కానిని అవుతాను’ అన్న ఆ యువతి వేలికి ఉంగరం తొడిగే వేళ అతడు.. ఇన్నాళ్లూ తనను చిన్నచూపు చూసిన విధినే చిన్నబుచ్చినంత పరమానందభరితుడయ్యాడు.
 
 పుట్టంధుడైన వేల్పూరి రవిబాబు, స్వరూపరాణిల కులాంతర వివాహం శనివారం తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో జరిగింది. వెదురుపాకకు చెందిన వీరబాబు పుట్టుకతోనే అంధుడు. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తల్లి మంగ, తండ్రి వెంకన్న అనారోగ్యంతో మృతిచెందారు. కంటిచూపు లేదని, కన్నవారు లేరని అతడు కుంగిపోలేదు. మండపేటలోని ప్రత్యేక అంధుల పాఠశాలలో చేరాడు. మొక్కవోని సంకల్పంతో డిగ్రీ, డీఈడీ చదివిన వీరబాబు 2012 డిసెంబర్‌లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ప్రస్తుతం కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి ఎంపీయూపీ పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
 
 పశ్చిమగోదావరి జిల్లా సమిశ్రగూడెంకు చెందిన స్వరూపరాణి డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి ఆశ వర్కర్ కాగా తండ్రి చిరుద్యోగి. కులాలు వేరైనా వీరబాబు, స్వరూపరాణిల వివాహం చేయడానికి పెద్దలు ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన స్వరూపరాణి  ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవయ్యా...అందుకే నా కన్నులతో లోకం చూడయ్యా’ అంటూ వీరబాబు జీవితంలో ప్రవేశించింది. అంధుల పాఠశాలలో వీరబాబు సహాధ్యాయులు, అతడి గురువులు వివాహానికి హాజరయ్యారు. వీరబాబు సహాధ్యాయులు తమకు కళ్లులేక పోయినా.. ఆనందకాంతులు నిండిన ముఖాలతో నవదంపతులను ఆశీర్వదిస్తుంటే చూసేవారి కళ్లు భావోద్వేగంతో చెమ్మగిల్లాయి.
 
 
 ఎంతోమంది స్నేహహస్తం అందించారు..
 నేను చదువుకునే సమయంలో మండపేట ప్రత్యేక అంధుల పాఠశాల యాజమాన్యంతో పాటు స్నేహితులు సహకరించారు. నేను చదవడానికి ఆర్థికంగా స్నేహితులు చేసిన సహాయం, అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
 - వేల్పూరి వీరబాబు
 
 కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను..

 మనిషికి దేవుడిచ్చిన వరం ఈ ప్రకృతి. దానిని చూడలేని వీరబాబుకు నా కళ్లతో ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. అతడిని నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను.
 - స్వరూపరాణి

మరిన్ని వార్తలు